నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగు

ABN , First Publish Date - 2020-12-31T03:19:56+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నాయని రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.

నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగు
ఇళ్ల పట్టాలు అందజేస్తున్న రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

ఆత్మకూరు, డిసెంబరు 30 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నాయని రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలు, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు లమలు చేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు అందజేసి సొంతింటి కల నెరవేర్చడం చారిత్రాత్మకమన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 169 లేఅవుట్లు ఏర్పాటు చేసి 9,522 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. ఆత్మకూరు మున్సిపాల్టీ పరిధిలోనే 1050 మందికి ఇళ్ల పట్టాలు, 1056 మందికి టిడ్కో ఇళ్లు కేటాయించామన్నారు. రూ.853 కోట్లతో సోమశిల హైలెవల్‌ కెనాల్‌ ఫేజ్‌-1, రూ. 648 కోట్లతో ఫేజ్‌-2, మరో 632 కోట్లతో ఉత్తర కాలువ విస్తరణ పనులు పూర్తి చేసి సాగు, తాగు నీటికి ఢోకా లేకుండా చేస్తానన్నారు. ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి రూ.3.16 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి కొళాయి ఏర్పాటుకు జలజీవన్‌ పథకం కింద నియోజకవర్గానికి రూ. 17.41 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఆత్మకూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేసి 10 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు, జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీవో సువర్ణమ్మ, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం రమే్‌షబాబు, డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌, డాక్టర్‌ ఆదిశేషయ్య, కొండా వెంకటేశ్వర్లు, పలువురు వైసీపీ మండల కన్వీనర్లు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-31T03:19:56+05:30 IST