మద్య రహిత ఎన్నికలకు చర్యలు

ABN , First Publish Date - 2020-03-13T09:58:17+05:30 IST

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను మద్యం రహితంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ రాధయ్య చెప్పారు. సూళ్లూరుపేట ఎక్సైజ్‌

మద్య రహిత ఎన్నికలకు చర్యలు

మూడు తాత్కాలిక చెక్‌పోస్టులు, 

రెండు మొబైల్‌ టీముల ఏర్పాటు 

ఎక్సైజ్‌ డీసీ రాధయ్య 


సూళ్లూరుపేట, మార్చి 12 : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను మద్యం రహితంగా  నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ రాధయ్య చెప్పారు. సూళ్లూరుపేట ఎక్సైజ్‌ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాకు బయట ప్రాంతాల నుంచి మద్యం రాకుండా నివారించేందుకు మూడు తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాయుడుపేట - తిరుపతి మార్గంలో ఒకటి, రాపూరు - చిట్టివేలి మార్గంలో మరొకటి,  మర్రిపాడు - బద్వేలు మార్గంలో ఇంకొకటి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  గూడూరు - సూళ్లూరుపేట ఎక్సైజ్‌ సీఐల ఆధ్వర్యంలో రెండు మొబైల్‌ టీములు నియమిస్తామన్నారు.


176 మంది బైండోవర్‌ 

ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా  176 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 22 అనధికారిక మద్యం షాపులను పట్టుకున్నామని, ఏడుగురిని అరెస్టు చేశామని చెప్పారు. వారి వద్ద 37 లీటర్ల మద్యం, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సూళ్లూరుపేటలో 268 సీసాల తమిళనాడు మద్యాన్ని పట్టుకున్నామన్నారు.  నలుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. తడ కారూరు వద్ద జపనీస్‌ రెసిడెన్షీపై దాడి చేయగా తమిళనాడుకు చెందిన 27 బీరు,  18 వైన్‌ బాటిళ్లు దొరికాయని చెప్పారు. ఆ రెసిడెన్షీ మేనేజర్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎక్సైజ్‌ సీఐ ఆర్‌యూవీఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-13T09:58:17+05:30 IST