గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన పొగాకు రైతులు
ABN , First Publish Date - 2020-05-24T09:19:58+05:30 IST
: వ్యాపారులు పొగాకు ధరలు దిగజార్చి కొంటున్నారని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేశారు.

దిగజారిన ధరలపై ఆగ్రహం
డీసీపల్లి కేంద్రంలో వేలం నిలిపివేత
మర్రిపాడు, మే 23: వ్యాపారులు పొగాకు ధరలు దిగజార్చి కొంటున్నారని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేశారు. రోజూలాగే వేలం కేంద్రానికి శనివారం మర్రిపాడు క్లస్టర్ నుంచి రైతులు 630 బేళ్లను తీసుకురాగా వాటిలో 139 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ తరుణంలో మీడియం గ్రేడ్(ఎఫ్ 3, ఎఫ్ 4)లకు సంబం ధించి కనీసం రూ.20 తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సగ భాగం వేలాన్ని నిలిపివేసి ముంబాయి జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వారితో తెచ్చిన పొగాకును దహనం చేశారు.
ఇప్పటికే కరోనా ప్రభావం వల్ల 50 రోజుల తర్వాత ఆలస్యంగా కొనుగోళ్లను ప్రారంభించిన తరుణంలో ధరలు మరింత దిగజా ర్చి కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలం కొనసాగేందుకు రైతులు సహకరించక పోవడంతో ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి కేంద్రాన్ని సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు. మరోవైపు అధికారుల సమాచారం మేరకు బోర్డు ఆర్ఎం సుధాకర్ కూడా సందర్శించి బోర్డు అధికారులతో చర్చించారు. అయినా వ్యాపారులు నిర్ణయించిన ధరకు రైతులు ససేమిరా అనడంతో వేలం ఆగి కొనుగోళ్లు నిలిచిపోయాయి.