మగ్గం గుంతల్లో నీళ్లు.. నేతన్నల కన్నీళ్లు

ABN , First Publish Date - 2020-12-02T04:11:00+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో మండలంలోని చేనేత మగ్గం గుంతల్లోకి నీరు చేరింది. దీంతో పనుల్లేక నేతన్నల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న పనులు కరోనా దెబ్బకు కుదేలయ్యాయి. దీనికితోడు విడవని వర్షాలతో ప్ర

మగ్గం గుంతల్లో నీళ్లు.. నేతన్నల కన్నీళ్లు
మగ్గం ముందు కార్మికుడు

పొదలకూరు(రూరల్‌), డిసెంబరు 1 : నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో మండలంలోని చేనేత మగ్గం గుంతల్లోకి నీరు చేరింది. దీంతో పనుల్లేక  నేతన్నల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న పనులు కరోనా దెబ్బకు కుదేలయ్యాయి. దీనికితోడు విడవని వర్షాలతో ప్రస్తుతం మగ్గం గుంతలన్నీ నీటితో నిండి ఉన్నాయి. వాటిని కార్మికులు బయటకు తోడి పోసినా, రెండు గంటల్లో తిరిగి నీరు నిండుతోందని వారు వాపోతున్నారు.  మండలంలోని బిరుదవోలు, తాటిపర్తి, పొదలకూరు, తోడేరు, వీవర్స్‌కాలనీ, సురాయపాళెం గ్రామాల్లో సుమారు 300 కుటుంబాలు నేతపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీరికి ప్రత్యామ్నాయం ఏమీలేదు. వ్యవసాయ భూములు కూడా లేవు, కేవలం రెక్కల కష్టంపైనే ఆధారపడి కుటుంబాలను నడుపుకుంటున్నారు. నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో నీట మునిగి నష్టపోయిన రైతులకు పరిహారం అందించినట్లుగానే కుటుంబాల వారికి కూడా పరిహారం పంపిణీ చేయాలని బాధిత కుటుంబాల వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వర్షాలకు జనవరి నెలాఖరు వరకు పనులు ఉండవు కాబట్టి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.15వేలు నెలనెలా పంపిణీ చేయాలని కార్మికుల కుటుంబాల వారు కోరుతున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కార్మికులకు కష్టకాలంలో రూ.11,500 పంపిణీ చేసి ఆదుకున్నదని వారు గుర్తుచేస్తున్నారు. 


చేనేత కార్మికులను ఆదుకోవాలి 


పూటగడవక అవస్థలు పడుతున్న చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. కార్మికులకు నూలు, రంగులు తదితర సరుకులను సబ్సిడీ ధరలకే పంపిణీ చేయాలి. వారు తయారు చేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర కల్పించాలి. 

- చింతగింజల చిన్న సుబ్రహ్మణ్యం, బీజేపీ చేనేత సెల్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.



Updated Date - 2020-12-02T04:11:00+05:30 IST