నివర్‌ నష్టం రూ.19.65 కోట్లు.. 18,558 హెక్టార్లలో పంటల మునక

ABN , First Publish Date - 2020-12-16T03:46:15+05:30 IST

జిల్లా రైతాంగాన్ని నివర్‌ తుఫాన్‌ నిలువునా ముంచేసింది.

నివర్‌ నష్టం రూ.19.65 కోట్లు.. 18,558 హెక్టార్లలో పంటల మునక

వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా 

కావలి సబ్‌డివిజన్‌లో పూర్తికాని పరిశీలన


నెల్లూరు (వ్యవసాయం), డిసెంబరు 15 : జిల్లా రైతాంగాన్ని నివర్‌ తుఫాన్‌ నిలువునా ముంచేసింది. జిల్లాలో దాదాపు సాగులో ఉన్న పంటలన్నీ నీట మునిగిపోయాయి. 18,558 హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచన వేశారు. అయితే, కావలి సబ్‌డివిజన్‌లో ఇంకా పొలాలు నీటిలో ఉండటంతో నష్టం ఎంతమేర జరిగిందో లెక్క తేలలేదు.


జిల్లాలో ప్రధాన రబీ సీజనులో రికార్డుస్థాయిలో రైతన్నలు సాగుకు సమాయత్తమయ్యారు. మనుబోలు, గూడూరు, బుచ్చి, కావలి, నెల్లూరు, వెంకటాచలం ఇలా సాగునీటి పారుదల ప్రాంతాల్లో రైతన్నలు వర్షాల కారణంగా రెండు నుంచి మూడుసార్లు నార్లు పోసుకున్న పరిస్థితి. దీంతో పెట్టుబడి పెరిగింది. నివర్‌ తుఫాన్‌కు తోడు వరద పోటెత్తడంతో పొలాల్లో నీట మునిగాయి. ఇసుక మేటలుగా మారిపోయాయి. కోతకొచ్చిన కొంతమేర పంట నీటమునిగింది. వరినారు, నాట్లు దెబ్బతిన్నాయి.   ఏరియల్‌ సర్వే ద్వారా నష్టపోయిన పంటలను చూసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి వెంటనే సర్వే చేసి ఈ నెల 15లోగా నివేదిక పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు .ఈ మేరు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టాల వివరాలను అంచనా కట్టారు. జిల్లాలో మొత్తం 21,260 మంది రైతులకు చెందిన దాదాపు 18558 హెక్టార్లలో పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి.


రూ.19.65 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదికలు రూపొందించింది. జిల్లాలో 1 3వేల హెక్టార్లలో మినుము, పెసర పంటలు దెబ్బతిన్నాయి. 60 హెక్టార్లలో మొక్కజొన్న, 2వేల హెక్టార్లలో వరి, 40 హెక్టార్లలో కోసిన వరి చేను దెబ్బతినగా, వరదతో ఇసుక మేటలుగా మారాయి. హెక్టారుకు వరికి రూ.15వేలు, మినుము, పెసరకు రూ.10వేలు, మొక్కజొన్నకు రూ.12,500, కోతలు, మేటలుకు రూ.12,200 మేర నష్టపరిహారం లభించనుంది.  కావలి సబ్‌ డివిజన్‌లో మాత్రం ఇప్పటికి పొలాల్లో వరద నీరు ఉండడంతో క్షేత్రస్థాయిలో పంటల నష్టం కొలిక్కి రాలేదు. 

Updated Date - 2020-12-16T03:46:15+05:30 IST