-
-
Home » Andhra Pradesh » Nellore » Lockdown until the end of the month
-
4.0లో మరిన్ని సడలింపులు
ABN , First Publish Date - 2020-05-18T09:58:09+05:30 IST
ఊహించినట్లుగా లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

నెలాఖరు వరకు లాక్‌డౌన్
కేంద్రం ఉత్తర్వుల జారీ
రాష్ట్ర ఆదేశాల ప్రకారం మార్గదర్శకాలు
జిల్లా స్థాయి సమీక్షలో
నేడు నిర్ణయం తీసుకునే అవకాశం
నెల్లూరు, మే 17 (ఆంధ్రజ్యోతి) : ఊహించినట్లుగా లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం నాటికి మూడు విడతల లాక్‌డౌన్ పూర్తయింది. సోమవారం నుంచి నాలుగో విడత లాక్‌డౌన్ మొదలు కానుంది. ఈ నెలాఖరు వరకు ఇది కొనసాగనుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సడలింపులకు అదనంగా మరికొన్ని సడలింపులిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఆదివారం రాత్రి జిల్లా అధికారులకు అందాయి.
నిర్ణయం రాష్ట్రాలదే..
జోన్ల విభజన, రవాణా పునరుద్ధరణ వంటి పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. ఆయా రాష్ట్రాలు వారి పరిధిలోని పరిస్థితులను బట్టి మరికొన్ని సడలింపులు చేసుకునేందుకు వీలు కల్పించింది. అయితే ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదివారం రాత్రి వరకు ఎలాంటి ఆదేశాలు జిల్లా అధికారులకు అందలేదు. సోమవారం ఉదయానికల్లా అందుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఆదేశాలానుసారం జిల్లా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించుకొని తదుపరి జిల్లా స్థాయిలో అమలు చేసే మార్గదర్శకాలను రూపొందించుకునే లా అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి వాటి ప్రకారం సడలింపులు కల్పించింది.
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లా రెడ్‌జోన్‌లో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొదట మండలాలను యూనిట్‌గా తీసుకొని జోన్లను విభజించింది. కానీ మూడో విడత లాక్‌డౌన్లో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల స్థానంలో కంటైన్మెంట్, బఫర్ జోన్ల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎక్కడైతే కరోనా పాజిటివ్ కేసు వచ్చిందో అక్కడి నుంచి కిలోమీటర్ రేడియస్‌లో కంటైన్మెంట్ జోన్‌గానూ, మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను బఫర్ జోన్‌గానూ గుర్తించారు. ఈ జాబితా ప్రకారం తొలుత 31 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా విభజించారు. ఆ తర్వాత నమోదవుతు న్న కేసుల ఆధారంగా జాబితాను సవరిస్తూ వస్తున్నారు. ఇక 28 రోజుల పాటు ఎటువంటి కేసు నమోదు కాకపోతే ఆ ప్రాంతాన్ని జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ కంటైన్మెంట్, బఫర్ జోన్ ప్రాంతాలనే రెడ్‌జోన్లుగా పరిగణిస్తున్నారు. ఇక మిగిలిన ప్రాంతాలను ఆరెంజ్ జోన్‌గా లెక్కిస్తున్నారు.
వైద్యశాఖ మ్యాప్‌లతో గందరగోళం
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మండలాలను యూనిట్‌గా పేర్కొంటూ రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మ్యాప్‌లు విడుదల చేశారు. దీనిపై కొంత గందరగోళం ఏర్పడింది. అయితే రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల విధానం లేదని, ప్రస్తుతం కంటైన్మెంట్, బఫర్ జోన్లుగానే గుర్తిస్తున్నట్లు జిల్లా అధికారులు స్పష్టం చేశారు. సోమవారం సమావేశం నిర్వహించి తాజా మార్గదర్శకాల ప్రకారం కంటైన్మెంట్, బఫర్ జోన్ల గుర్తింపు, అక్కడ వర్తించే సడలింపులను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
కాగా ఇప్పటి వరకు ఉన్న సడలింపులు కొనసాగుతాయి. వాటికి అధనంగా మరికొన్ని సడలింపులు వర్తిస్తాయి. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చే వ్యక్తులు తప్పని సరిగా మాస్కులు ధరించాలి. అన్ని కార్యాలయాల్లో కూడా ఉద్యోగులు మాస్కులు ఉపయోగించాలి. ఇక పెళ్లిళ్లకు గరిష్ఠంగా 50 మందికి, అంత్యక్రియలకు గరిష్ఠంగా 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్లు లోపు పిల్లలకు బయట తిరిగేందుకు అనుమతి లేదు. అలాగే రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.