ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత

ABN , First Publish Date - 2020-08-01T10:38:09+05:30 IST

రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రి జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత కరోనా బాధితుల ప్రాణాలను బలితీసుకుంటోంది.

ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత

 అవసరమైనన్ని లేక ప్రాణాలు హరీ

క్యాజువాలిటీ నుంచి ఐసీయుకు వచ్చేలోగా గాలిలో కలుస్తున్న ఊపిరి

ఆసుపత్రి మొత్తానికి మొబైల్‌ సిలిండర్లు రెండే

అవి కూడా ఫుల్లా.. ఖాళీయా..? చూసే దిక్కు లేదు

ప్రధాన భవనంలోనే గందరగోళం


నెల్లూరు, జూలై31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రి జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత కరోనా బాధితుల ప్రాణాలను బలితీసుకుంటోంది. బతకాలన్న ఆశతో ఆసుపత్రికి చేరిన బాధితులు ఆక్సిజన్‌ అందుబాటులో లేక అత్యవసర విభాగం నుంచి ఐసీయూ వార్డుకు చేరే లోపే ప్రాణాలు వదిలేస్తున్నారు. 600 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆసుపత్రిలో మొబైల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో లేవు. కేవలం సకాలంలో ఆక్సిజన్‌ అందని కారణంగానే జీజీహెచ్‌లో పలు మరణాలు సంభవిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలే చెబుతున్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు. 


స్టెక్చర్‌ మీదే పోతున్న ప్రాణాలు

జీజీహెచ్‌లో పెద్ద భవనం నిర్మించారు. ప్రతి బెడ్డుకు పైపుల ద్వారా ప్రాణవాయువు అందేలా సెంట్రలైజ్‌డ్‌ ఆక్సిజన్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. అయినా ఏం లాభం. అయినా ఇక్కడ ప్రాణవాయువు అందక పలు మరణాలు సంభవిస్తున్నాయి. ఇక్కడ ప్రాఽథమిక చికిత్స అందించిన తరువాత ఐసీయూకు తరలిస్తున్నారు. అయితే అత్యవసర విభాగం నుంచి ఐసీయూలకు తరలించే లోపే ప్రాణవా యువు అందక పలు మరణాలు సంభవిస్తున్నట్లు సమా చారం. కరోనా వల్ల ప్రధానంగా కలిగే ఇబ్బంది ఊపిరి ఆడకపోవడం. ఇలాంటి కేసులకు కృతిమ పద్ధతిలో ఆక్సిజన్‌ అందివ్వాలి. ఆసుపత్రిలో సెంట్రలైజ్‌డ్‌ ఆక్సిజన్‌ సిస్టమ్‌ ఉంది కాబట్టి అత్యవసర విభాగంలో, ఐసీయూ వార్డులో ఇబ్బంది లేదు. అయితే అత్యవసర విభాగం నుంచి ఐసీయూ వార్డుకు తరలించే మార్గమధ్యలోనే బాధితులకు ఆక్సిజన్‌ అందడం లేదు.


శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్న రోగులకు కంటిన్యూగా కృత్తిమ ఆక్సిజన్‌ అందించాలి. అందుకోసం అత్యవసర విభాగం నుంచి ఐసీయూకు తరలించే సమయంలో మొబైల్‌ ఆక్సిజన్‌ సిలిండర్ల ద్వారా బాధితుడికి ఆక్సిజన్‌ అందించాలి. ఆసుపత్రిలో మొబైల్‌ ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. కేవలం రెండు మాత్రమే ఉన్నట్లు సమాచారం. నెల క్రితం వరకు జీజీహెచ్‌లో కేవలం 60నుంచి 70 మంది మాత్రమే కరోనా బాధితులు ఉండేవారు. వారిలో క్రిటికల్‌ కండీషన్‌లో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య తక్కువ. అప్పట్లో ఈ రెండు మొబైల్‌ సిలిండర్లు సరిపోయేవి. ఇప్పుడు జీజీహెచ్‌లో 600 మందికి పైగా కరోనా బాధితులు ఉన్నారు. రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. ఇదే సమయంలో క్రిటికల్‌ కండీషన్‌లో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య పెరిగిపోతోంది.


ఈ పరిస్థితుల్లో కూడా కేవలం రెండు మొబైల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లతోనే సేవలు అందించడం సాధ్యం కావడం లేదు.పైగా ఈ సిలిండర్ల కెపాసిటీ కూడా తక్కువే. కంటిన్యూగా మూడు గంటలు వాడితే వాటిలో ఆక్సిజన్‌ ఖాళీ అవుతుంది. ఒక సారి ఆక్సిజన్‌ ఖాళీ అయితే మళ్లీ భర్తీ చేసే వరకు దిక్కులేదు. దీంతో క్రిటికల్‌ కేసులను సైతం ఆక్సిజన్‌ సపోర్టు లేకనే అత్యవసర విభాగాల నుంచి ఐసీయూకు తరలిస్తున్నారు. స్టెక్చర్‌ బాయ్స్‌ కొరత కారణంగా బాధితులను ఎమర్జన్సీ వార్డు నుంచి ఐసీయూకు తరలించడంలోనూ అసాధారణ జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. ఈ జాప్యాన్ని ప్రశ్నించే వారు ఉండరు.

 

ప్రధాన భవనంలోనే  గందరగోళం

నెల క్రితం వరకు జీజీహెచ్‌లో 70 నుంచి 80 మందికి మించి కరోనా బాధితులు ఉండేవారు కారు. కాబట్టి అప్పట్లో పనిచేసే కొంత మంది వైద్య సిబ్బందిపై భారం మోపి చేతులు దులుపుకునేవారు. ఇప్పుడు కేసులు పెరగడంతో   600 మందికిపైగా కరోనా బాధితులు అడ్మిషన్‌లో ఉన్నారు. దీంతో ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఏర్పడింది. స్టాఫ్‌ నర్సులకు డేటా ఎంట్రీకే సమయం సరిపోతోంది. వైద్య సిబ్బం ది మొత్తంలో ఐసీయూ వార్డులో సేవలు అందించడానికి అనువైన శిక్షణ పొందిన వారు 10 శాతానికి మించి లేరని సమాచారం. ఎంఎన్‌వోలు, స్టెక్చర్‌ బాయ్స్‌ కొరత ఉంది. చాలా మంది డాక్టర్లు, వైద్య సిబ్బందికి పాజిటివ్‌ రావడంతో సెల వుపై వెళ్లిపోయారు. ఆసుపత్రి వర్గాల మాటల్లో చెప్పాలంటే జీజీహెచ్‌ మెయిన్‌ బిల్డింగ్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. 


 స్టేట్‌ కోవిడ్‌ ఆసుపత్రి అంటే ఇదేనా..!?

జీజీహెచ్‌ను స్టేట్‌ కోవిడ్‌ ఆసుపత్రిగా ప్రభుత్వం ప్రకటించిన సందర్భంలో మంత్రులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు విపరీతంగా సమీక్షలు నిర్వహించారు. ఆసుపత్రికి అవసరమైన అన్ని వనరులు సమకూర్చుతా మన్నారు. కాని అవి ఆచరణలో కనిపించడం లేదనడానికి మొబైల్‌ ఆక్సిజన్‌ సిలిండర్ల కొరతే నిదర్శనం. కేవలం ఆక్సిజన్‌ అందక సంభవిస్తున్న మరణాలను ఎవరి ఖాతాలో వేయాలి. జీజీహెచ్‌లో ఇలాంటి వైఫల్యాలు ఇంకెన్ని ఉన్నాయో ఉన్నతా ధికారులు పరిశీలించాలి.  వెంటనే పాలకులు, ఉన్నతాధికా రులు జీజీహెచ్‌లో వైద్య సేవలపై దృష్టి సారించాలి.

Updated Date - 2020-08-01T10:38:09+05:30 IST