అత్తపై కోడలి హత్యాయత్నం

ABN , First Publish Date - 2020-03-04T09:49:54+05:30 IST

ఆస్తి కోసం అత్తపై కోడలు హత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని చౌకచర్ల గ్రామంలో

అత్తపై కోడలి హత్యాయత్నం

చౌకచర్లలో ఆస్తి కోసం ఘటన 


విడవలూరు, మార్చి 3: ఆస్తి కోసం అత్తపై కోడలు హత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని చౌకచర్ల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు,  బాధితురాలి కథనం మేరకు గ్రామానికి చెందిన కుల్లూరు పెద్దరాగయ్య, లీలమ్మ దంపతుల కుమారుడు కుమార్‌కి కావలి మండలానికి చెందిన ఉమకు పదేళ్ల క్రితం పెద్దలు వివాహం చేశారు. వారికి ఇద్దరు సంతానం. ఓ ప్రైవేటు కంపెనీలో కుమార్‌ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తండ్రి మరణానంతరం తల్లిని  కుమారే చూసుకుంటున్నాడు.  రెండు నెలల క్రితం కుమార్‌ అనారోగ్యంతో మృతిచెందాడు. కుమార్‌ తల్లి లీలమ్మ మంచం పట్టింది.  గ్రామంలో మీ సేవా నడుపుతున్న అశోక్‌కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఉమ రెండు వారాల క్రితం అతనితో గ్రామం విడిచి వెళ్లిపోయింది.


అనంతరం తరచూ అత్త వద్దకు వచ్చి నీపేరు మీద ఉన్న ఇల్లు, 1.50సెంట్లు భూమిని తనపేరు మీద రాసివ్వాలని గొడవపడేది. ఈక్రమంలో మంగళవారం రాత్రి అత్త వద్దకు వచ్చి గొడవకు దిగింది. ఆస్తి పత్రాల కోసం ఇంటి తలుపులను గడ్డపారతో పగలగొట్టబోయింది. అడ్డుపడిన అత్తపై దాడికి దిగి గొంతుకు గుడ్డ బిగించి చంపబోయింది. లీలమ్మ గట్టిగా కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు  అక్కడ చేరుకున్నారు. దాంతో ఉమ అక్కడ నుంచి పరారైంది. ఈ  సంఘటన గ్రామంలో దావానలంలా వ్యాపించడంతో ప్రజలు ఒక్కిసారిగా ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ నాయకులు ఓగు నాగేశ్వరరావు, సమాది శ్రీనివాసులు, కొల్లు వెంకయ్యలు లీలమ్మని పరామర్శించారు. బాఽధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2020-03-04T09:49:54+05:30 IST