తండ్రీకొడుకుల మృతితో టాలీవుడ్‌లో విషాదం

ABN , First Publish Date - 2020-08-20T18:25:03+05:30 IST

తండ్రీకొడుకుల మృతి టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది. నెల్లూరు జిల్లా..

తండ్రీకొడుకుల మృతితో టాలీవుడ్‌లో విషాదం

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఆగిఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్ 

మృతులిద్దరూ నెల్లూరు జిల్లావాసులు

‘కేఎఫ్‌సీ’పేరుతో సినిమాల నిర్మాణం

పలు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్లు కూడా..


బుచ్చిరెడ్డిపాళెం(నెల్లూరు): తండ్రీకొడుకుల మృతి టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం రేబాల గ్రామానికి చెందిన కేఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గుండాల కమలాకర్‌రెడ్డి, ఈయన తండ్రి నందగోపాల్‌రెడ్డి నల్లగొండ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. కరోనా బారిన పడ్డ నందగోపాల్‌కు మెరుగైన వైద్యం కోసం నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామ శివారులో ఆగిఉన్న లారీని అంబులెన్స్ ఢీకొంది. దీంతో గుండాల నందగోపాల్‌రెడ్డి(75), కమలాకర్‌రెడ్డి(48) అక్కడిక్కడే మృతి చెందారు. అంబులెన్స్ డ్రైవర్ నాగరత్నయ్యకు తీవ్రగాయాలు అయ్యాయి. తండ్రీ కొడుకుల మృతితో కేఎఫ్‌సీ నిర్మాణ సంస్థతోపాటు నెల్లూరులో విషాదం అలుముకుంది. వీరి స్వగ్రామం బుచ్చి మండలం రేబాలలో బుధవారం రాత్రి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.


సినీ ప్రముఖుల సంతాపం

తండ్రీకొడుకుల మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇటీవల విడుదలైన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాను కేఎఫ్‌సీ ఎంటర్‌టైన్నెంట్ సంస్థ విడుదల చేసింది. ఈ చిత్రానికి కమాలకర్‌రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అంతేగాక తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రం, అర్జున్‌రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస, ఆత్రేయ వంటి సినిమాలను పంపిణీ చేశారు. పలు తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్ సినిమాలకు కూడా ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు.

Updated Date - 2020-08-20T18:25:03+05:30 IST