తొలివిడతతోనే సరా!?

ABN , First Publish Date - 2020-07-10T11:03:41+05:30 IST

మండలంలోని చింతలదీవి పశుసంవర్ధక క్షేత్రంలో జాతీయ కామధేను పఽథకానికి 2017లో అప్పటి కేంద్రమంత్రి ముప్పవరపు ..

తొలివిడతతోనే సరా!?

 ‘కామధేను’కు నిధులు విడుదలయ్యేనా?

పథకం ప్రారంభంలో రూ.25 కోట్ల మంజూరు

ఆ తర్వాత ప్రకటనలకే పరిమితం

నీటి సమస్య అల్లాడుతున్న మూగజీవాలు


కామధేను ప్రాజెక్టు.. దక్షిణ భారతదేశానికే తలమానికం. ఇక్కడ వివిధ రకాల పశువులను వృద్ధి చేసి రైతులకు అందజేయాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకానికి నిధుల గండం పట్టుకుంది. తొలి విడత నిధులు తప్ప ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇంకేముంది అభివృద్ధి ఆగిపోయింది.


కొండాపురం, జూలై 9 :  మండలంలోని చింతలదీవి పశుసంవర్ధక క్షేత్రంలో జాతీయ కామధేను పఽథకానికి 2017లో అప్పటి కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. రూ.250 కోట్లు కేటాయించగా, తొలివిడతగా రూ.25 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నగదుతో ఇప్పటివరకు పశువులకు ఏడు షెడ్లు, అధికారుల నివాసగృహాలు, ఒక పరిపాలనా భవనం 2018 నాటికి నిర్మాణం పూర్తిచేశారు. దేశవాళీ పశువులను అభివృద్ధి చేసి వాటి సంతతిని మానవాళికి అందించడం ఈ పఽథకం ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి 12 రకాల గోజాతి, 5 రకాల గేదెలు కలిపి మొత్తంగా 191 పశవులను 2018లోనే ఇక్కడకు తరలించారు. వాటి సంతతితో మొత్తం ఇప్పటివరకు 486 పశువులు కేంద్రంలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.  


వేధిస్తున్న నీటి  కొరత

జాతీయ కామధేను పఽథకానికి అన్ని వసతులు బాగానే ఉన్నప్పటికీ నీటి కొరత ప్రఽధానసమస్యగా మారింది. కేంద్రంలో దాదాపు 17 బోర్లు వేసినా ఆశించిన స్థాయిలో నీరు లభించలేదు. పశువుల మేత కోసం దాదాపు 200 ఎకరాలలో పచ్చిమేతను పెంచుతున్నారు. వేసవికాలంలో బోర్లలో నీరు సక్రమంగా రాకపోవడంతో మేత సమస్య ఎదురవుతుండటంతో శాశ్వత పరిష్కారం కోసం రాళ్లపాడు రిజర్వాయరు నుంచి పైపులైను ద్వారా నీటిని తరలించేందుకు రూ.12.5 కోట్లు మంజూరు చేసి దాదాపు రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించారు.  ఆయకట్టు రైతులు ఒప్పుకోకపోవడంతో అప్పట్లో పనులు ఆగిపోయాయి. రైతులను ఒప్పించినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. పైపుల ద్వారా కేంద్రానికి తరలించే నీటిని నిల్వ ఉంచేందుకు నీరు-చెట్టు ద్వారా దాదాపు రూ.21 లక్షలతో రెండు పర్కులేషన్‌ ట్యాంకులు కూడా ఏర్పాటు చేశారు. నీరు మాత్రం లేదు. తొలివిడతగా మంజూరైన నిధులు తప్ప ఇప్పటివరకు ఒక్క రూపాయి విడుదల కాకపోవడంతో అభివృద్ధి పనులు దాదాపుగా ఆగిపోయాయి.


ఉన్నతాధికారులకు నివేదించాం .. డాక్టర్‌ రామన్‌, జేడీ, కామధేను పథకం

రాళ్లపాడు రిజర్వాయరు నుంచి కేంద్రానికి నీరు తరలిస్తేనే నీటి సమస్య తీరుతుంది. కేంద్రంలో ఉన్న 17 బోర్ల నుంచి వచ్చిన నీటినే పశువులకు తాగునీరు, మేతను పెంచేందుకు ఉపయోగిస్తున్నాం. నీటి తరలింపు పనులు పూర్తయితే పశువుల నీటి సమస్య తీరడంతో పాటు భూగర్భజలం పెరుగుతుంది. బడ్జెట్‌లో నిధులు ప్రకటించినప్పటికీ విడుదల చేయలేదు. సమస్యను ఉన్నతాధికారులకు నివేదించాం.

 

Updated Date - 2020-07-10T11:03:41+05:30 IST