సచివాలయ సేవలను వినియోగించుకోండి
ABN , First Publish Date - 2020-10-24T11:30:28+05:30 IST
ప్రజలు సచివాలయ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

జాయింట్ కలెక్టర్ హరేంద్రప్రసాద్
పొదలకూరు, అక్టోబరు 23 : ప్రజలు సచివాలయ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం పొదలకూరు బిట్-1 సచివాలయం, మంగలంలోని మొగళ్లూరు గ్రామ సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ పనితీరును, వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల మంజూరును పరిశీలించారు. అలాగే తహసీల్దారు కార్యాలయంలో చుక్కల భూముల రికార్డులను పరిశీలించి ఆయన మాట్లాడారు. ప్రజలకు వేగంగా ఆయా గ్రామాల్లోనే సమస్యల పరిష్కారం కోసం సచివాలయ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయన వెంట తహసీల్దారు స్వాతి, డిప్యూటీ తహసీల్దారు శివకుమార్, ఆర్ఐ వెంకటేశ్వర్లు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
వెంకటాచలం: మండలంలోని చుక్కల భూముల సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. మండలంలోని కనుపూరు బీట్ - 2, కాకుటూరు రెవెన్యూ పరిధిలోని చుక్కల భూములకు సంబంధించిన రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం కనుపూరు బీట్ - 2 రెవెన్యూ పరిధిలోని సరస్వతీ నగర్ సమీపంలో ఉన్న చుక్కల భూములను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని మిగత గ్రామాల్లోని చుక్కల భూముల సమస్యను కూడా రెవెన్యూ సిబ్బంది సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట తహసీల్థార్ ఐఎస్ ప్రసాద్, సర్వేయర్ మల్లికార్జున్, ఆర్ఐ స్వర్ణలత, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.