పేదల పక్షపాతి జక్కా వెంకయ్య

ABN , First Publish Date - 2020-05-29T10:52:36+05:30 IST

సీపీఎం సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జక్కా వెంకయ్య పేదల పక్షపాతిగా పేరు పొందారు. భూస్వామిగా పుట్టి ..

పేదల పక్షపాతి జక్కా వెంకయ్య

ఏడు పదుల జీవితం పార్టీకే అంకితం

భూస్వామి నుంచి సామాన్యుడిగా ప్రస్థానం

నేడు ద్వితీయ వర్ధంతి


బుచ్చిరెడ్డిపాళెం, మే 28 : సీపీఎం సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జక్కా వెంకయ్య పేదల పక్షపాతిగా పేరు పొందారు. భూస్వామిగా పుట్టి  నిరుపేదల కోసం సామాన్యుడిగా జీవనం సాగించారు. 70 ఏళ్ల ఆయన జీవితం పార్టీకే అంకితం చేశారు. నేడు ఆయన ద్వితీయ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.


ఆస్తి అంతా పార్టీకే..

బుచ్చి మండలం దామరమడుగుకు చెందిన జక్కా రమణారెడ్డి, శంకరమ్మలకు 1930 నవంబరు 3న  ఆయన జన్మించారు. బుచ్చి హైస్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదివారు. 18 ఏళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతలు చేపట్టి 1951 వరకు వ్యవసాయం చేశారు. అప్పటికే నిఽషేధంలో వున్న ఆనాటి కమ్యూనిస్టు పార్టీకి నాయకుడిగా, గూఢచారిగా  పని చేశారు. పార్టీ కార్యక్రమాలను  ముందుకు తీసుకెళ్లే క్రమంలో పలు మార్లు జైలు జీవితం గడిపాడు.  కుటుంబం ద్వారా ఆయన భాగానికి వచ్చిన వ్యవసాయ భూమిని సైతం పార్టీకే  అంకితమిచ్చారు. 


వెంకయ్యగా పేరు మార్పు

పేదవాళ్లలో ఓ పేదవాడిగా ఉంటూ తనకు ఇబ్బందిగా తయారైన వెంకురెడ్డి పేరును చట్టబద్దంగా తాలూకా కార్యాలయంలో చలానా కట్టి వెంకయ్యగా మార్చుకున్నారు. సీపీఎం నాయకుడిగా ప్రజా సమస్యలకోసం ఎన్నో పోరాటాలు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు, వ్యవసాయ భూములు సాధించారు. తొలిసారిగా 1951లో తెలంగాణా సాయుధ పోరాటం స్ఫూర్తి, డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి ప్రోత్సాహంతో సీపీఎం సభ్యుడిగా చేరి  1953లో వ్యవసాయ కూలి పెంపుకోసం జరిగిన పోరాటానికి నాయకత్వం వహించారు. 1957 నుంచి 1964వరకు ఆ గ్రామ సర్పంచుగా గ్రామాభివృద్దితోపాటు స్థానిక ప్రజలను చైతున్యవంతులను చేశారు.


ఆయన పోరాట ఫలితమే షుగర్‌ ప్యాక్టరీ 

ఆయన పోరాట ఫలితమే నేటికీ షుగర్‌ ఫ్యాక్టరీ నిలచివుంది. ఆయనకి వచ్చే ఎమ్మెల్యే పెన్షన్‌ పైసా కూడా తీసుకోకుండా పార్టీకీ ఇచ్చేవారని ఆపార్టీ నాయకులు చెబుతున్నారు. కుల, మత, బంధుప్రీతి లేని వెంకయ్య స్ఫూర్తితోనే 60 ఏళ్లుగా  దామరమడుగు  పంచాయతీ సీపీఎం పరమైంది.


Updated Date - 2020-05-29T10:52:36+05:30 IST