‘జగనన్న తోడు’ ఏదీ!?

ABN , First Publish Date - 2020-12-31T04:12:59+05:30 IST

చిరువ్యాపారులను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన ‘‘జగనన్న తోడు’’ పథకం కొందరికే పరిమితమైంది.

‘జగనన్న తోడు’ ఏదీ!?

చిరువ్యాపారులకు అందని నగదు

49,503 మందిలో 19,760 మందికే లబ్ధి

అధికారుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు

బ్యాంకర్ల కొర్రీతో ఇబ్బందులు 


నెల్లూరు (హరనాథపురం), డిసెంబరు 30 : చిరువ్యాపారులను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన ‘‘జగనన్న తోడు’’ పథకం కొందరికే పరిమితమైంది. వేలాది మంది దరఖాస్తు చేసుకున్నా కొందరికే బ్యాంకు రుణాలు అందాయి. నవంబరు 25న జిల్లాలో ప్రారంభమైన ఈ పథకం కింద సున్నావడ్డీకే  రూ.10వేల రుణం అందచేస్తారు. వీల్‌కార్టు, సైకిల్‌, మొబైల్‌ వెహికల్‌ సీట్‌ ద్వారా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి  తిరుగుతూ విక్రయాలు జరిపేవారు, నిర్ధిష్ట ప్రదేశాలలో వివిధ వస్తువులు అమ్ముకునేవారు, చిరువ్యాపారులు, తోపుడు బండ్లు, గంపలలో వస్తువులు మోస్తూ అమ్ముకొనే వారు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఈ పథకం ప్రారంభం కాగానే లబ్ధిదారుల ఖాతాల్లో ప్రకటించిన మొత్తం జమ అయినట్లు అధికారులు ప్రకటించారు. కానీ  అది ప్రకటనలకే పరిమితమైంది.


49,503 మంది లబ్ధిదారులు

జిల్లాలో ఈ పథకం కింద 49,503 మంది చిరువ్యాపారులు రుణం కోసం దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో డీఆర్‌డీఏ పరిధిలో 35,966 మంది, మెప్మా పరిధిలో 13,537 మంది ఉన్నారు. వీరిలో 19,760మందికి మాత్రమే బ్యాంకర్లు రుణాలు అందించారు. అందిన దరఖాస్తులలో 47,729 దరఖాస్తులే డీఆర్‌డీఏ, మెప్మాల నుంచి బ్యాంకులకు వెళ్లాయి. మిగిలిన 1,774 దరఖాస్తులు ఆయా కార్యాలయాల్లో పరిశీలనలో ఉన్నాయి. 


బ్యాంకర్ల కొర్రీ

ఈ పథకం కింద దరఖాస్తు చేసుకొన్న లబ్ధిదారులకు బ్యాంకులు కొర్రీలు పెడుతూ రుణాలను మంజూరు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. డీఆర్‌డీఏ, మెప్మాల నుంచి దరఖాస్తులు బ్యాంకులకు వెళ్లినా వాటికి సత్వర పరిష్కారం కనిపించడం లేదు. జిల్లాలో మొత్తం 49,503 మంది దరఖాస్తు చేసుకొంటే 47729 దరఖాస్తులను బ్యాంకులు స్వీకరించాయి. వీటిలో కేవలం 19,760 మందికే రుణాలను మంజూరు చేశారు. బ్యాంర్లు స్వీకరించిన దరఖాస్తులలో కోడ్‌ జనరేషన్‌, ఇతర కారణాలు చూపుతూ రుణాలు మంజూరు చేయలేదని సమాచారం. పథకం ప్రారంభం అయిన రోజునే నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందని అధికారులు ప్రకటించి 40 రోజులు దాటుతున్నా ఇంత వరకు వేలాది మంది ఖాతాలో జగనన్న తోడు నగదు జమకాలేదు.  డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు కూడా  చిరువ్యాపారులకు రుణాలు వెంటనే మంజూరు చేయాలని బ్యాంకుల మీద ఒత్తిడి చేయడంలేదని సమాచారం. తమకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా అధికారులు రుణాలు మంజూరు చేయించాలని చిరువ్యాపారులు కోరుతున్నారు. 


అందరికీ  మంజూరు చేయిస్తాం 

దరఖాస్తు చేసుకొన్న చిరువ్యాపారులందరికీ బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకొంటాం. ఇందుకు సంబంధించి బ్యాంకర్ల మీద ఒత్తిడి తెస్తాం. త్వరలో లబ్ధిదారులందరికీ రుణాలు మంజూరు చేయిస్తాం.

- సాంబశివారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్‌, డీఆర్‌డీఏ


నగదు అందలేదు..

జగనన్న తోడు పథకం కింద నగదు వస్తుందని ఆశగా ఎదురుచూశా.. కానీ అందలేదు. వలంటీర్లను అడిగితే రెండవ దఫా వస్తుందని చెబుతున్నారు.  రెండవ దఫా ఇస్తారో.. ఇవ్వరో? ఇస్తే.. ఎప్పుడిస్తారో? అర్థం కాని పరిస్థితి.

-చినకోటయ్య, చిరువ్యాపారి, కావలి


రుణం కోసం తిరుగుతున్నా..

జగనన్న తోడు పథకంలో చిల్లర దుకాణం నడుపుకునేందుకు అర్హత సాధించా. రుణం కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఏ ఒక్క అధికారి స్పందించడం లేదు. అదిగో.. ఇదిగో.. అని చెప్పి జనవరిలో ఇస్తామని మాట దాటేస్తున్నారు. 

- దారా పుట్టమ్మ, పొదుపు సభ్యురాలు, కోట

 

Updated Date - 2020-12-31T04:12:59+05:30 IST