-
-
Home » Andhra Pradesh » Nellore » inter evaluation
-
ఏమవుతుందో..?
ABN , First Publish Date - 2020-05-18T10:04:41+05:30 IST
ఇంటర్ విద్యాశాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకుండానే ఆదివారం మూల్యాంకనం ప్రారంభించారు.

భయం భయంగా విధులకు అధ్యాపకులు
ప్రారంభమైన ఇంటర్ మూల్యాకనం
జాగ్రత్తలు తీసుకోని ఇంటర్ బోర్డు
రెడ్‌జోన్ నుంచే ఎక్కువుగా హాజరు
ముందస్తు పరీక్షలు జరపని అధికారులు
శానిటైజర్లు, మాస్కులు అందించని వైనం
నెల్లూరు (విద్య) మే 17 : ఇంటర్ విద్యాశాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకుండానే ఆదివారం మూల్యాంకనం ప్రారంభించారు. కనీస జాగ్రత్తలు కూడా పాటించకపోవడం తో అధ్యాపకులు భయం భయంగా విధులకు హాజరయ్యారు. మూల్యాకనంలో పాల్గొనే ఏ ఒక్కరికి కూడా ముందస్తు పరీక్షలు నిర్వహించలేదు. రెడ్‌జోన్ అయిన నెల్లూరు నుంచి అధికంగా అధ్యాపకులను విధులకు కేటాయించారు. కనీసం వీరికి శానిటైజర్లు, మాస్కులు అందించకపోవడంతో పలువు రు అధ్యాపకులు ఇదేమిటి.. మాకు ఏదైనా జరిగితే ఎవరు జవాబుదారీ అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఆలస్యంగా మూల్యాంకనం
మూల్యాంకనం జరిగే గదుల వద్ద మాత్రం బ్లీచింగ్ చల్లించారు. ఉదయం పది గంటలకు ప్రారంభం కావాల్సిన మూల్యాంకనం మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ప్రారంభం కాలేదు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే జవాబుపత్రాలు రావాల్సి ఉందని, అలాగే శానిటైజర్‌లను కూడా ఆర్డర్ ఇచ్చామని, అవి వచ్చేవరకు ఎదురు చూస్తున్నామని చెప్పారు. అధ్యాపకులు మాత్రం లాక్‌డౌన్ వలన ప్రభుత్వ ఉద్యోగులకు సగం వేతనం, కాంట్రాక్ట్ లెక్చరర్‌లకు అసలు వేతనాలే లేకపోవడంతో చుట్టుముట్టిన ఆర్ధిక ఇబ్బందుల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరు కావాల్సి వచ్చిందన్నారు.
నిబంధనలు గాలికి..
కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలిస్తుండగా ఇంటర్ అధికారులు మాత్రం వీటిని పాటించలేదు. హాజరైన అధ్యాపకులకు కనీసం శానిటైజర్‌లు, మాస్క్‌లు కూడా ఇవ్వకపోవడం విచారకరం. దీంతో తమకు ఏం జరుగుతుందోనన్న భయాందోళన వారిలో నెలకొంది. దీనికి తోడు సామాజిక దూరం పాటించాల్సి ఉన్నా కూడా స్పాట్‌లో అలాంటి పరిస్థితులు కూడా కనిపించలేదు. మూల్యాంకనం ప్రారంభం కావడం ఆలస్యం కావడంతో అధ్యాపకులు, సిబ్బంది అందరూ కూడా గుంపులుగా చేరి ఒక దగ్గర కూర్చుని చర్చించుకుంటూ కనిపించారు. వందల సంఖ్యలో సిబ్బంది విధులకు హాజరవుతున్నా వైద్యశాఖ నుంచి కేవలం ఇద్దరు నర్సులను మాత్రమే స్పాట్ బయట కూర్చోబెట్టారు. అలాగే శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఒకేఒక్క కానిస్టేబుల్ విధుల్లో ఉన్నారు. ఈ విషయమై ఒకరిద్దరు సిబ్బంది అధికారులను ప్రశ్నించగా తమకు ఇంటర్‌బోర్డు నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఏర్పాట్లు చేశామని చెప్పారు.
60శాతం మందే హాజరు
మూల్యాంకనానికి జిల్లా వ్యాప్తంగా 60శాతం మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో మహిళలు పదిశాతం మంది కూడా హాజరు కాలేదు. జిల్లాకు చేరిన 4లక్షల జవాబు పత్రాలకు సంబంధించి మొత్తం మూడు విడతల్లో మూల్యాంకనం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దీంతో మొదటి విడత ఆదివారం ప్రారంభించారు. ఇందుకోసం 600 మంది సిబ్బందిని నియమించారు. జిల్లాలో మొత్తం నాలుగు కేంద్రాలను మూల్యాంకనానికి కేటాయించారు. నెల్లూరులో కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో, గూడూరులో డీఆర్‌డబ్ల్యూ జూనియర్ కళాశాలలో, కావలి జేబీ కళాశాలలో, ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూల్యాంకనానికి ఏర్పాట్లు చేశారు. ఆయా సెంటర్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొదటి విడతలో ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం, హిందీ, గణితం, సివిక్స్ పేపర్లను మూల్యాకనం చేయాల్సి ఉంది.
ఇంటి నుంచే భోజనం
కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది అందరూ కూడా వారి భోజనాలను ఇంటి వద్ద నుంచే తెచ్చుకోవాలని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో అత్యధికశాతం మంది అధ్యాపకులు విధులకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపలేదు. తాము కంటోన్మెంట్ జోన్‌లలో నివాసం ఉంటున్నామని కొందరు, తమకు ఆరోగ్య పరిస్థితులు బాగాలేవని మరికొందరు అధికారులకు తెలియచేసి విధులకు డుమ్మా కొట్టారు.
విధులకు హాజరు కాలేం..
ఉన్న సిబ్బందితో నాలుగు ప్రాంతాల్లో మొక్కుబడిగా మూల్యాంకనాన్ని చేపట్టారు. రెండో విడతలో మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా, తమకు వసతులు కల్పించకపో యినా విధులకు హాజరు కాలేమని అధ్యాపకులు తేల్చి చెపుతున్నారు. దీనిపై ఇంటర్‌బోర్డు అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.