రైతు పక్షపాతి ముసుగులో..అన్నదాతకు అన్యాయం

ABN , First Publish Date - 2020-10-21T05:39:40+05:30 IST

రైతుల పక్షపాతి అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ విమర్శించారు.

రైతు పక్షపాతి ముసుగులో..అన్నదాతకు అన్యాయం

వ్యవసాయ చట్టాలపై ఉద్యమం

రెండు కోట్ల సంతకాల సేకరణ

పీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ 


నెల్లూరు (వైద్యం) అక్టోబరు 20 : రైతుల పక్షపాతి అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ విమర్శించారు. నెల్లూరులోని ఇందిరాభవన్‌లో మంగళవారం పార్టీ జిల్లా కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. శైలజానాథ్‌ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు తెలపటం దారుణమన్నారు. ఆ చట్టాల వల్ల రైతులు పండించిన పంటలు బయట మార్కెట్‌లో అమ్ముకునే అవకాశం ఉండదన్నారు. అలాగే సహకార బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంకుకు కట్టబెట్టటం వల్ల రైతులకు వ్యవసాయ రుణాలు అందని ద్రాక్షలా మారుతాయ న్నారు. ఇప్పటికే దేశంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉండగా కేంద్రం తీసుకువచ్చిన చట్టాలతో అవి మరింత పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అంటూనే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేలా జీవో నెంబర్‌ 22ను విడుదల చేయటం మంచి పద్ధతి కాదన్నారు. మరోవైపు రాష్ట్రంలో, దేశంలోనూ మహిళలు, దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో 2 కోట్ల సంతకాల సేకరణ, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు శైలజానాథ్‌ చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు చేపడతామని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం, పార్టీ సీనియర్‌ నేత వింజమూరు కాలేషా మృతికి నేతలు సంతాపం తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి దొడ్డారెడ్డి భూపాల్‌రెడ్డి, డీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తలారి బాల సుధాకర్‌, నగర అధ్యక్షుడు ఉడతా వెంకట్రావు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు చింతాల వెంకట్రావు, దుద్దుకూరి రమేష్‌నాయుడు, షేక్‌ ఫయాజ్‌, భవానీ నాగేంద్ర ప్రసాద్‌, కొండా అనిల్‌కుమార్‌, ఏటూరి శ్రీనివాసులు రెడ్డి, అల్లాఉద్దీన్‌, లతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-21T05:39:40+05:30 IST