అమరావతి రైతులకు అన్యాయం చేస్తే పుట్టగతులు ఉండవు
ABN , First Publish Date - 2020-12-18T04:22:09+05:30 IST
అమరావతి రైతులకు అన్యాయం చేసినవారికి పుట్టగతులు ఉండవని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు.

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల
సూళ్లూరుపేట, డిసెంబరు 17 : అమరావతి రైతులకు అన్యాయం చేసినవారికి పుట్టగతులు ఉండవని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. అమరావతి రైతుల పోరాటానికి 365 రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం ఆయన సూళ్లూరుపేటలో నేతలు, కార్యకర్తలతోకలసి ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి పురవీధుల్లో రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యకర్తలతో కలసి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిగా అమరావతి రైతులు పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతుపై వాన కురిసినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వారిని అనేకసార్లు చర్చలకు పిలిచిందన్నారు. ఇక్కడ 365 రోజులుగా అలుపెరగకుండా రైతులు పోరాటం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మన శ్రీధర్, నాయకులు తిరుమూరు సుధాకర్‌రెడ్డి, ఆకుతోట రమేష్, జి. శంకరయ్య, ఎం .సాయి, సీ. పెరుమాల్, మెస్ రమణయ్య, కె. పెంచలయ్య, శ్రీనివాసులునాయుడు, సురే్‌షనాయుడు, పూడి సెల్వం, శివాజీ పాల్గొన్నారు.