సొంతింటి కల నెరవేరేనా?

ABN , First Publish Date - 2020-12-12T03:59:54+05:30 IST

జిల్లాలో జానెడు స్థలం, సొంత గూడు లేని పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

సొంతింటి కల నెరవేరేనా?
సంగంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్ల స్థలాల లే అవుట్‌

జిల్లాకు తొలి విడత 53,953 గృహాల మంజూరు

25న పట్టాల పంపిణీ తర్వాత శంకుస్థాపన

ప్రస్తుతం నుడా, మున్సిపాలిటీల్లోనే..

గ్రామీణ ప్రాంతాల్లో మంజూరు ఎప్పుడో?

తక్కువ నిధులపై లబ్ధిదారుల్లో సందేహాలు


ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర తరువాత పక్కాగృహాల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో మొదట నుడా, మున్సిపాలిటీల్లోనే అనుమతి ఇచ్చింది. అంతేకాదు ఇంటి నిర్మాణానికి గత ప్రభుత్వం కేటాయించిన నిధుల కంటే తక్కువ వ్యయంతో అదీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించు కోవాల్సి ఉంటుంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ పెరిగిన ఇంటి నిర్మాణ సామగ్రి వ్యయంతో ఈ నిధులు ఏ మాత్రం సరిపోవని లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేదల సొంతంటి కల తీరేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


సంగం, డిసెంబరు 11: జిల్లాలో జానెడు స్థలం, సొంత గూడు లేని పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏడాది తరువాత అట్టహాసంగా ఈ కార్యక్రమానికి ఈ నెల 25వ తేదీన స్థలాల పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించింది. ఆ వెంటనే ఇంటి నిర్మాణానికి మంజూరు కూడా ఇస్తామని ప్రకటించింది.


మొదటి విడతలో 53,953 పక్కాగృహాలు 

 జిల్లాలో మొదటి విడతగా 53,953 పక్కాగృహాలు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు ప్రకటించారు. ఇవి కేవలం పట్టణ ప్రాంతాల్లోని నుడా, మున్సిపాలిటీల్లో నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. సొంతింటి కోసం గ్రామీణ ప్రాంత పేదలు మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే.


ఇంటి వ్యయం గత ప్రభుత్వం కంటే తక్కువే

 రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన మంజూరు చేయబోయే ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలు కేటాయించారు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ నిధులు రూ.30 వేలు, కేంద్రం అందించే రూ.1.5 లక్షలు కలిపి రూ.1.8 లక్షలతో ఇళ్లు నిర్మించుకోవాల్సి ఉంది. అదే పట్టణాల్లో ఉపాధి హామీ నిధులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే తనవంతు వాటాగా రూ.30 వేలు చెల్లించనుంది. అంతకంటే ఇచ్చే నగదు రాయితీ పైసా లేదు. అదే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.5 లక్షలు మంజూరు చేసేది. ఎన్నికల్లో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల వరకు ఇస్తామని ప్రకటించినప్పటికీ హామీని మరచినట్లు పేదలు బహిరంగంగా విమర్శిస్తున్నారు.


రూ.1.8 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తయ్యేనా..

 రాష్ట్ర ప్రభుత్వం పక్కాగృహాలకు చిల్లిగవ్వ కూడా విదల్చకుండా కేవలం ఇంటి నిర్మాణానికి కేంద్ర విడుదల చేసే రూ.1.5 లక్షలతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఉపాధి నిధులు రూ.30 వేలతో సరిపెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉంది. ఇంటి నిర్మాణానికి కావలసిన ఇసుక ఉచితంగా ఇవ్వడంతో పాటు మిగిలిన ఇంటి నిర్మాణ సామగ్రి ఇటుక, ఇనుప సువ్వ, కంకర వంటి మెటీరియల్‌ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసి ప్రభుత్వం కేటాయించిన నిధు ల్లో మినహాయించుకుంటామంటున్నారు. అయినా ప్రస్తుతం పెరిగిన కూలీలు, ఇంటి నిర్మాణ సామగ్రితో పోల్చుకుంటే ఏ మాత్రం సరిపోవని గ్రామీణ ప్రాంతాల పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో ఈ నిధులు ఏ మూలకు వస్తాయో, లబ్ధిదారులు ఎలా ఇంటి నిర్మాణం చేస్తారో సందేహమే. 


రూ.1.8 లక్షలు సరిపోతాయి : కరీముల్లా, ఏఈ

 ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలు సరిపోతాయి. సిమెంటు, ఐరన్‌ తదితర మెటీరియల్‌ను తక్కువ ధరకు లబ్ధిదారులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లా కలెక్టర్‌, గృహ నిర్మాణశాఖ అధికారుల సహకారంతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేలా లబ్ధిదారులకు తోడ్పాటు అందిస్తాం.

Updated Date - 2020-12-12T03:59:54+05:30 IST