ఆరంకణాలిచ్చి వైసీపీ ప్రభుత్వం డబ్బాలు

ABN , First Publish Date - 2020-12-27T04:39:33+05:30 IST

నివాసయోగ్యంగా లేని ఆరంకణాల స్థలాలు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి డబ్బాలు కొట్టుకుంటున్నారని టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌అజీజ్‌ విమర్శించారు.

ఆరంకణాలిచ్చి వైసీపీ ప్రభుత్వం డబ్బాలు
మాట్లాడుతున్న అజీజ్‌, పక్కన నాయకులు

 నివాసయోగ్యమైన స్థలాలివ్వాలి

టీడీపీ నేత అబ్దుల్‌ అజీజ్‌


నెల్లూరు(వ్యవసాయం), డిసెంబరు 26 : నివాసయోగ్యంగా లేని ఆరంకణాల స్థలాలు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి డబ్బాలు కొట్టుకుంటున్నారని టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌అజీజ్‌ విమర్శించారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం  ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు చరిత్రను చూస్తే 1975లో మినీబైపాస్‌ స్థలాన్ని ఖాళీ చేయించిన వారికి 16 అంకణాలు, ఆకుతోట యూకో బ్యాంకు కాలనీ వారికి 32 అంకణాలు, యలమవారిదిన్నెలో 400 ఇళ్లు తీసేస్తే ప్రతి ఒక్కరికీ 16 అంకణాల స్థలం ఇచ్చారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వైఎస్సార్‌ నగర్‌లో ప్రతిఒక్కరికీ 9అంకణాల స్థలం ఇచ్చారన్నారు. అప్పట్లో ఆ ఇళ్లు నివాసయోగ్యంగా లేకపోతే టీడీపీ ప్రభుత్వం ప్రతి ఇంటికీ రూ.20వేలు మంజూరు చేసిందన్నారు. అంతేగాక అక్కడ సౌకర్యాలు కల్పిస్తే అందరూ ఉండేందుకు ఇప్పుడు ముందుకు వస్తున్నారన్నారు.  వైఎస్సార్‌ నగర్‌ పేరు మాత్రం మార్చలేదన్నారు. అలాంటిది చంద్రబాబు నిర్మించిన ఇళ్లకు సిగ్గులేకుండా రంగులు మారుస్తున్నారని విమర్శించారు. తాము 6 అంకణాల్లో ఇల్లు కట్టి ఇచ్చామని, పక్కన కారిడార్‌, లిఫ్ట్‌ స్థలం అవన్నీ కలిపితే ఎంత వస్తుందో తెలుసుకోవాలని మంత్రి అనిల్‌కు సూచించారు. ప్రజలకు నీటమునగని స్థలాలు, నివాసయోగ్యంగా ఉండేవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నెల్లూరు పార్లమెంటు మహిళాధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి, నాయకులు పొత్తూరు శైలజ, రేవతి, రోజారాణి, జలదంకి సుధాకర్‌, సాబీర్‌ఖాన్‌, ఆశిక్‌ అలీ, ఖాజావలి, మామిడాల మధు, నన్నేసాహెబ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-27T04:39:33+05:30 IST