అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

ABN , First Publish Date - 2020-12-26T05:05:30+05:30 IST

అర్హులైన ప్రతి ఆడపడచుకు ఇంటి స్థలం పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తున్న మంత్రి అనిల్‌

తొలివిడతలో 7800 మందికి ఉచితంగా ఇళ్లు

ఒక్క రూపాయితో అపార్ట్‌మెంట్‌ ఫ్లాటు

పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అనిల్‌


నెల్లూరు(వెంకటేశ్వరపురం), డిసెంబరు 25 : అర్హులైన ప్రతి ఆడపడచుకు ఇంటి స్థలం పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్‌ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన జగనన్న వెంచర్‌లో శుక్రవారం ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి 30,800 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. తొలుత 15,500 మందికి స్థలాలు ఇస్తున్నామని, వారిలో మొదటి విడతగా 7800 మందికి ఉచితంగా ఇళ్లు కట్టించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి స్థలాల వద్ద మొక్కలు నాటారు. వరద ముంపు నేపథ్యంలో నగరంలో పెన్నానదికి రెండు వైపుల రివిట్‌మెంట్‌ నిర్మిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం పెన్నాలోకి చొచ్చుకెళ్లిన 10 నుంచి 30 వరకు ఇళ్లు మినహా మిగిలిన వాటిని తొలగించబోమని హామీ ఇచ్చారు. అనంతరం  అపార్ట్‌మెంట్ల వద్దకు చేరుకుని 300 చదరపు అడుగుల ఫ్లాట్లకు పట్టాలను పంపిణీ చేశారు. అలాంటి ఫ్లాట్లను 14 వేల మందికి ఒక్క రూపాయికే అందిస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో కలెక్టరు చక్రధర్‌బాబు, జాయింట్‌ కలెక్టర్‌ హరీందిర ప్రసాద్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ దినేష్‌ కుమార్‌, నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌, వైసీపీ నాయకులు రూప్‌కుమార్‌, నిశ్చలకుమార్‌రెడ్డి, ప్రకాష్‌, మస్తాన్‌, ఖయూమ్‌, రమణ, జమీర్‌, ఖాజాబాబా కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


రూరల్లో 15,339 మందికి ఇళ్ల స్థలాలు

నెల్లూరు రూరల్‌, డిసెంబరు 25 :  నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో 15,339 మంది పేదలకు నివేశ స్థలాలు అందచేస్తున్నట్లు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం అక్కచెరువుపాడు వద్ద 1411 మంది లబ్ధిదారులకు నివేశస్థల పట్టాలను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ  త్వరలోనే ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్‌ ఎస్‌ఈ శ్రీనివాస సంజయ్‌, రూరల్‌ తహసీల్దారు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, డీటీ నాజర్‌, మాజీ మేయర్‌ భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-26T05:05:30+05:30 IST