సంక్షోభంలో ఆతిథ్య రంగం

ABN , First Publish Date - 2020-07-22T10:51:25+05:30 IST

కరోనా దెబ్బతో జిల్లాలోని హోటళ్ల రంగం కుదేలైంది. ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన ఈ రంగం

సంక్షోభంలో ఆతిథ్య రంగం

ఆదరణ లేక నేడు రెస్టారెంట్లు, హోటళ్లు వెలవెల

ఉపాధి కోల్పోయిన నిరుద్యోగులు


గూడూరు(రూరల్‌), జూలై 21 : కరోనా దెబ్బతో జిల్లాలోని హోటళ్ల రంగం కుదేలైంది. ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన ఈ రంగం నేడు సంక్షోభంలో కూరుకుపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా హోటళ్లను మూసివేశారు. అనంతరం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినా మునుపటి వ్యాపారాలు లేక నష్టాల బారిన పడుతున్నామని యజమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో అతిథులతో కళకళలాడే రెస్టారెంట్‌లు నేడు అతిఽథులకు కోసం ఎదురు చూస్తున్నాయి. జిల్లాలో వందలాది రెస్టారెంట్‌లు, వేలాదిగా  హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌సెంటర్‌లు, మెస్‌లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి పొందేవారు. 


ఉదాహరణకు గూడూరును తీసుకుంటే రైల్వే జంక్షన్‌ కావడంతో తిరుమలకు వెళ్లే వారు, వచ్చే ప్రయాణికులు అధికంగా ఉంటారు.దీంతో హోటళ్ల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉండేది. కరోనా వల్ల నాలుగు నెలలుగా రైళ్లు నిలిపివేయడం, కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో కరోనాకు భయపడి ఎవరూ హోటళ్లకు వెళ్లడంలేదు. పట్టణంలోని రెస్టారెంట్లలో గతంలో రోజుకి సుమారు రూ. 30 వేల నుంచి రూ.70 వేల వరకు వ్యాపారాలు జరిగేవి. నేడు కనీసం రూ. 5 వేలకు మించి జరగకపోవడంతో సిబ్బందికి జీతాలు, బాడుగలు చెల్లించలేక, విద్యుత్‌ బిల్లులు కట్టలేక, హోటళ్లను నిర్వహించలేకపోతున్నారు.


ఇప్పటికే పట్టణంలో 4 రెస్టారెంట్లను మూసివేశారు. ఇదే బాటలో పలు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, మెస్‌లు ఉన్నాయి. గతంలో కళకళలాడిన వ్యాపారాలు నేడు కుదేలవడంతో ప్రభుత్వమైనా ఈ రంగాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని వాటి యజమానులు కోరుతున్నారు.

Updated Date - 2020-07-22T10:51:25+05:30 IST