నేడు ప్రైవేటు వైద్యశాలల బంద్‌

ABN , First Publish Date - 2020-12-11T05:12:02+05:30 IST

ప్రైవేట్‌ వైద్యశాలల నిర్వాహకులు శుక్రవారం బంద్‌ పాటిస్తున్నారు.

నేడు ప్రైవేటు వైద్యశాలల బంద్‌
పొగతోటలోని ప్రైవేటు ఆసుపత్రులు

ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలు నిలిపివేత

ఆయుష్‌ వైద్యులకు శస్త్రచికిత్సల అనుమతులపై నిరసన

ప్రభుత్వ వైద్యుల సంఘం సంఘీభావం


నెల్లూరు(వైద్యం)డిసెంబరు 10 : ప్రైవేట్‌  వైద్యశాలల నిర్వాహకులు శుక్రవారం బంద్‌ పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రులు మూసివేసి వైద్యులు నిరసన చేపట్టనున్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) దేశవ్యాప్త బంద్‌కు ఇచ్చిన పిలుపు మేరకు  ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్యసేవలు నిలిపివేసి కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేయనున్నాయి. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (సీసీఐఎం) ఆయుష్‌ వైద్యులకు శస్త్రచికిత్సలు చేసుకునేలా అనుమతులు జారీ చేసింది. దీనిపై అల్లోపతి వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పలు వ్యాధులకు శస్త్రచికిత్సలు చేయటంలో నిష్ణాతులైన అల్లోపతి వైద్యులతో సమానంగా శస్త్రచికిత్సలు చేసే అవకాశం కల్పించటం, రోగులకు అత్యంత ప్రమాదకరమని అల్లోపతి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఐఎంఏ చేపడుతున్న బంద్‌కు ప్రభుత్వ వైద్యుల సంఘం కూడా మద్దతు తెలిపింది. ప్రభుత్వం ఆసుపత్రుల్లో వైద్యులు నల్లబాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నారు. 


అత్యవసర వైద్యం తప్ప.. 


వైద్యుల బంద్‌ కారణంగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వైద్య సేవలన్నీ నిలిచి పోనున్నాయి.ఈ దశలో అత్యవసర వైద్యానికి మాత్రం ఐఎంఏ వెలుసుబాటు కల్పించింది. జిల్లా వ్యాప్తంగా 1500లకుపైగా ప్రైవేట్‌ ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో 50వరకు కార్పొరేట్‌ ఆసుత్రులు  ఉన్నాయి. ప్రత్యేకించి నెల్లూ రులోని పొగతోటలోనే అత్యధికంగా 500కు పైగా ఆసుప త్రులు ఉన్నాయి. వైద్యుల బంద్‌ కారణంగా ఆయా ఆసుప త్రుల్లో ఓపీ సేవలతోపాటు ఇతర వైద్య చికిత్సలు అన్ని  నిలిపి వేస్తున్నారు. దాదాపు 12 గంటల పాటు ఆయా ఆసుపత్రులలో వైద్య సేవలు అందుబాటులో ఉండవు.


 అనుమతులు రద్దు చేయాలి 


ఎలాంటి అనుభవం లేని ఆయుష్‌ వైద్యులకు శస్త్రచికిత్సలు చేసే అవకాశం కల్పించటం సరికాదు. దీని వల్ల రోగుల ప్రాణాలకు భద్రత ఉండదు. ఈ పరిస్ధితిలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ పునరాలోచించి ఆయుష్‌ వైద్యులకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి. అందుకే దేశ వ్యాప్తంగా బంద్‌ పాటిస్తున్నాం.

- డాక్టర్‌ అశోక్‌, ఐఎంఏ రాష్ట్ర నేత


Updated Date - 2020-12-11T05:12:02+05:30 IST