అప్పుల పాలయ్యాం..మమ్మల్ని ఆదుకోండి!
ABN , First Publish Date - 2020-04-25T09:45:53+05:30 IST
రేషన్ షాపులు మూసివేసి, సరుకుల పంపిణీని ఆపేయడానికి డీలర్లు సిద్ధమవుతున్నారు

కమీషన్, ఖర్చులు ఇవ్వాలని వేడుకోలు
షాపుల మూతకు సమాయత్తం
జేసీకి వినతిపత్రం అందజేసిన డీలర్లు
నెల్లూరు (హరనాథపురం), ఏప్రిల్ 24 : రేషన్ షాపులు మూసివేసి, సరుకుల పంపిణీని ఆపేయడానికి డీలర్లు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ నెలలో తమకు రావాల్సిన కమీషన్, డోర్ డెలివరీ ఖర్చులను ఇవ్వకపోవడంతో ఈ కరోనా సీజన్‌లో తామే అన్నీ భరించి అప్పుల పాలయ్యామని వాపోతున్నారు. ఈమేరకే బంద్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. నెల్లూరు టౌన్ (అర్బన్, రూరల్) రేషన్ డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శేగు కుమారస్వామి ఆధ్వర్యంలో డీలర్లు సమస్యల వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ వినోద్‌కుమార్‌కు శుక్రవారం డీలర్లు అందచేశారు.
ఒక దఫా రేషన్ ఉచిత పంపిణీకి సుమారు ఒక్కో రేషన్ షాపునకు సుమారు రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. రెండు పర్యాయాలు ఉచిత పంపిణీకి సుమారు రూ.50వేలు ఖర్చు అయిందని డీలర్లు చెబుతున్నారు. ఏప్రిల్ నెల రేషన్ పంపిణీకి సంబంధించి ఖర్చుల తాలూకు బిల్లు మొత్తం చెల్లించలేదని తెలిపారు. ఇలా బకాయిల కోసం డీలర్లు రేషన్ షాపులు మూసివేస్తే ఈ కరోనా సీజన్‌లో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
బకాయిలు చెల్లిస్తేనే.. శేగు కుమారస్వామి, అధ్యక్షుడు, నెల్లూరు టౌన్ రేషన్ డీలర్ల అసోసియేషన్
ఏప్రిల్ మేము చేసిన ఖర్చులు చెల్లిస్తేనే మే నెల రేషన్ సరకులు పంపిణీ చేయగలం. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా రేషన్ షాపుల బంద్ చేపడతాం. మా ఆర్థిక స్తోమతను అధికారులు పరిగణలోకి తీసుకోవాలి. గోదాము నుంచి వచ్చే సరుకులు మాకు తగ్గుతున్నాయి. మొత్తం సరుకులు ఒకేసారి తీసుకోవాలని గోదాము ఇన్‌చార్జి ఇబ్బంది పెడుతున్నారు. రెండుసార్లు డోర్ డెలివరీ ఇప్పించే సౌకర్యం కల్పించాలి.