‘నివర్‌’తో భారీ వర్షం

ABN , First Publish Date - 2020-11-27T06:41:47+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో మండలంలో బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది.

‘నివర్‌’తో భారీ వర్షం
వెంకటాచలంలో భారీ వర్షం కారణంగా ఇంట్లోకి చేరిన నీరు

వెంకటాచలం, నవంబరు 26 :  నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో మండలంలో  బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. మండలంలోని కసుమూరు, వెంకటాచలం, మొలకలపూడి, పలుకూరువారిపాళెం, ఇందిరమ్మకాలనీ తదితర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉండే ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సహాయక చర్యలు తీసుకున్నారు. కసుమూరు పంచాయతీ శ్రీరామపురం, ఇడిమేపల్లి తదితర గ్రామాల్లో పంట పొలాలు నీటమునిగి నారుమళ్లు, వరినాట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండలంలోని తిరుమలమ్మపాళెం గ్రామంలో నాలుగు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ శాఖ ఏఈ అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది మరమ్మతులు చేసి   సరఫరాను పునరుద్ధరించారు. కొన్ని గ్రామాల్లో డ్రైనేజి వ్యవస్ధ సక్రమంగా లేకపోవడంతో రహదారులు, ప్రధాన వీధులు, కూడళ్లల్లో వర్షపు నీరు నిలిచిపోయి వాహనచోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో  గాలుల తీవ్రతతో చెట్లు నేలకొరిగాయి. తుఫాన్‌ కారణంగా ఇళ్ల పైకి చెట్లు పడి దెబ్బతినగా మరికొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరి దెబ్బతిన్నాయి. తహసీల్దారు ఐఎస్‌ ప్రసాద్‌, ఎంపీడీవో ఏ సరళ, రూరల్‌ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ షేక్‌ కరీముల్లా, గృహ నిర్మాణ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ శాఖాధికారిణి మంజుల, వివిధ శాఖల అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరం ఉన్న చోట సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ద్వారా సమస్యలను పరిష్కరించారు.


Read more