ఏడాదంతా కక్ష సాధింపే!

ABN , First Publish Date - 2020-05-30T11:12:56+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. జిల్లాలోని 10 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ ఈ ఏడాదిలో రాజకీయంగా

ఏడాదంతా కక్ష సాధింపే!

సొంత పార్టీలోనే గ్రూపు తగాదాలు

ఫలితమివ్వని సీఎం జగన్‌ పంచాయితీ

దాడులు.. ఆస్తుల ధ్వంసాలు

రాజకీయ బదిలీలు ఎన్నో

అధికారులపైనే ఘాటైన విమర్శలు


ఏడాది క్రితం..

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జిల్లాలో వైసీపీ నాయకులందరూ ఏకతాటిపై నిలబడ్డారు. ఏ సమస్య వచ్చినా సమష్టిగా పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. 

 

ఇప్పుడు...

ఒకరంటే ఒకరికి పడదు. మంత్రి పదవులు దక్కలేదనో.. మరే ఇతర కారణాలో తెలియదు కానీ ముఖ్యనేతల్లో ఈర్ష్యధ్వేషాలు పెరిగిపోయాయి. నాయకులంతా గ్రూపులు కట్టడంతో కార్యకర్తలు నలిగిపోతున్నారు.


నెల్లూరు, మే 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. జిల్లాలోని 10 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ ఈ ఏడాదిలో రాజకీయంగా సాధించిందేమిటి? పార్టీ మరింత బలపడిందా!? బలహీనపడిందా!? మంచి చెడ్డల విశేషాలేమిటి.. అనే కోణంలో విశ్లేషించుకుంటే.. రాష్ట్ర మంత్రి వర్గంలో అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతంరెడ్డిలకు కీలక శాఖలు దక్కడం జిల్లా పార్టీకి ప్లస్‌. అయితే కొద్ది రోజుల్లోనే అది మైనస్‌గా పరిణమించింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జిల్లా వైసీపీ నాయకులందరూ ఏకతాటిపై నిలబడ్డారు. ఏ సమస్య వచ్చినా సమష్టిగా పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత సీన్‌ రివర్సయింది. తమను కాదని జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారనే ఈర్ష్య ముఖ్యనేతల్లో విభేదాలకు బీజం వేసినట్లు ప్రచారం జరిగింది.


ఈ ప్రభావం కొద్ది రోజుల్లోనే బహిర్గతమైంది. మంత్రి అనిల్‌తో సర్వేపల్లి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అనిల్‌ నాయకత్వాన్ని ఈ ఇద్దరు వ్యతిరేకిస్తూ వచ్చారు. అనిల్‌, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒక జట్టుగా, కాకాణి, ఆనం రామనారాయణరెడ్డి మరో జట్టుగా కొంతకాలం పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ రెండు వర్గాల మధ్య పంచాయితీ ముఖ్యమంత్రి జగన్‌ వరకు వెళ్లింది. విలేకరుల సమావేశంలో ఆనం వ్యాఖ్యలను రాష్ట్ర పార్టీ తీవ్రంగా ఖండించింది.


కట్టుదాటితే ఎవరైనా సరే సహించేది లేదని హెచ్చరించింది. ఆనం జగన్‌ను కలిసి అనిల్‌పై ఫిర్యాదు చేశారు. మంత్రి అనిల్‌కు మాట మాత్రం కూడా చెప్పకుండా కాకాణి గోవర్ధన్‌రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహించారు. ఇది పెద్ద దుమారం లేపింది. దీంతో అధికారులు ఇరుకునపడాల్సి వచ్చింది. కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులపై ధిక్కార ధోరణి ప్రదర్శించగా, మరి కొందరు అంటీ ముట్టనట్లు ప్రవర్తిస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీల మధ్య సఖ్యత కనిపించడం లేదు.


ఇక్కడ వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయి బాహాబాహీకి దిగుతున్నాయి. నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరని కారణంగా కీలకమైన నుడా చైర్మన్‌ పోస్టు భర్తీ ఆగిపోయింది. ఈ పోస్టుపై ఆశలు పెట్టుకున్న పలువురు నాయకులకు నిరాశ మిగలగా, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డికి టీటీడీ ట్రస్ట్‌ బోర్డు సభ్యురాలిగా, ఆనం విజయకుమార్‌రెడ్డికి డీసీసీబీ చైర్మన్‌ పదవులు వరించాయి.  


ఎమ్మెల్యేలపై కేసులు

ఏడాది కాలంలో అధికార పార్టీ నాయకులు కేంద్ర బింధువులుగా పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. మహిళా ఎంపీడీవోపై దౌర్జన్యం చేశారన్న అభియోగంపై రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. కరోనా సాయం అందించడంలో నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగంపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. 


దాడులు.. ధ్వంసాలు

ఏడాది కాలంలో ప్రతిపక్షాలకు చెందిన పలువురిపై దాడులు, ఆస్తుల విధ్వంసాల సంఘటనలు చోటు చేసుకున్నాయి. దగదర్తిలో కార్తీక్‌ అనే తెలుగుదేశం కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించి టీడీపీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. వైసీపీ, పోలీసు అధికారుల వేధింపుల వల్లే టీడీపీ కార్యకర్త కార్తిక్‌ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆరోపించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుపై హత్యాయత్నం జరగగా, రూరల్‌ ఎమ్మెల్యే అనుచరులే ఈ దాడికి కారకులని టీడీపీ ఫిర్యాదు చేసింది.  నెల్లూరు నగరానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు పడవల సుధాకర్‌పై హత్యాయత్నం కూడా వైసీపీ వర్గాల పనిగానే ప్రచారం జరిగింది. తాజాగా సీబీఎన్‌ ఆర్మీ జిల్లా ప్రధాన కార్యదర్శి హజరత్‌పై దాడి చేశారు. వైసీపీ నేతలపై పోస్టింగ్‌లు పెట్టారంటూ టీడీపీ సోషల్‌మీడియాకు చెందిన ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.


రాజకీయ కారణాలతో వెంకటేశ్వరపురానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్‌కు చెందిన ఇళ్లను నేలమట్టం చేశారు. ఈ కూల్చివేత వెనుక మంత్రి అనిల్‌ హస్తం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కావలిలో అమృత్‌ పథకం కింద ఏర్పాటు చేసిన పైలాన్‌ను రాత్రికి రాత్రి కూల్చి వేశారు. ఈ శిలాఫలకంపై నారా లోకేష్‌ పేరు ఉందనే అక్కసుతో కావలి వైసీపీ నాయకులు ఈ విధ్వంసానికి పాల్పడ్డారని టీడీపీ, బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జమీన్‌ రైతు సంపాదకుడు డోలేంద్రప్రసాద్‌పై దాడి జరిగింది. కొందరు జర్నలిస్టులకు బెదిరిం పులు ఎదురయ్యాయి. 


రాజకీయ బదిలీలు.. విమర్శలు  

ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల బదిలీల్లో తమ మాట చెల్లుబాటు కాలేదనే ఉద్దేశంతో ఎస్పీ ఐశ్వర్య రస్తోగిని బదిలీ చేశారు. ఈ బదిలీని వ్యతిరేకిస్తూ అధికార పార్టీకి చెందిన నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి సొంత పార్టీకి చెందిన నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం విశేషం. కావలి సబ్‌ కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ వెనుక అధికార పార్టీ నేత హస్తం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌ మూర్తి బదిలీకి అధికార పార్టీ నేతల అసంతృప్తే కారణంగా తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులు జిల్లా అధికారులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను తీవ్ర పదజాలతో విమర్శించారు.


కరోనా సాయం పంపిణీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని కోవూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన క్రమంలో ఆ ఎమ్మెల్యే ఎస్పీ, కలెక్టర్‌లను ఏక వచనంతో తీవ్రంగా విమర్శించారు. ఇదే తరహా కారణంతో ఎమ్మెల్యే కాకాణి కూడా కలెక్టర్‌, ఎస్పీలపై విరుచుకుపడ్డారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో పర్యటించిన సబ్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి హాజరైన నేరానికి డివిజన్‌ స్థాయి ఇంజనీర్లను, డక్కిలి ఎంపీడీవో, తహసీల్దార్లను ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సెలవుపై వెళ్లేలా చేశారు. ఈ చర్యలు ఉద్యోగ వర్గాల్లో అధికార పార్టీపై వ్యతిరేకతకు బీజం వేశాయి. 


స్థానిక ఎన్నికలపై పట్టు

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి కాకముందే గ్రామాల్లో అధికార పార్టీ పట్టు సాధించుకుంది. నయానా, భయానా పలు స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. ప్రత్యేకించి కొన్ని మండలాల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. మొండిగా ముందుకు వచ్చిన వారిపై దాడి చేశారు. ఈ ఘటనలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మాజీ మంత్రి పరసారత్నంపై దాడిచేసి గాయపరిచారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా అడ్డుకునే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. 


కలిసొచ్చిన కరోనా

కరోనా ఒక విధంగా అధికార పార్టీ నాయకులకు మేలు చేసింది. కష్టకాలంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడంలో ఒకరిద్దరు మినహా మిగిలిన అందరు ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. రెండు నెలల పొడవునా పేదలకు ఉచితంగా సరుకులు, కూరగాయలు పంచిపెట్టారు. ఒక విధంగా ఈ సహాయ కార్యక్రమాలు అధికార పార్టీ నాయకులకు రాజకీయంగా ఉపయోగపడ్డాయి. 

Updated Date - 2020-05-30T11:12:56+05:30 IST