ధాన్యం బకాయిలు...దయ చూపండి!!
ABN , First Publish Date - 2020-07-10T11:01:23+05:30 IST
: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి నగదు సకాలంలో అందకపోవటంతో రైతులు ..

చెల్లింపులకు నోచుకోని రూ.103 కోట్లు
ఆందోళనలో అన్నదాతలు
నెల్లూరు(హరనాథపురం), జూలై 9 : ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి నగదు సకాలంలో అందకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా చెల్లింపులు జరపలేదని వాపోతున్నారు.
జిల్లాలో గత సీజన్లో సుమారు 5.50 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరు నుంచి పంట చేతికొచ్చింది. సాధారణ రకానికి క్వింటాలుకు రూ.1815, గ్రేడ్-ఏ రకానికి క్వింటాలుకు రూ.1835ను మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా 179 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 4.05లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్ల వివరాలు అన్నీ ఆన్లైన్లో నమోదైతేనే రైతులకు చెల్లింపులు జరిపే అవకాశం ఉంటుంది. అయితే మార్చి నెలాఖరులో ఆన్లైన్ సమస్య తలెత్తడంతో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు ఆలస్యమయ్యాయి. మొత్తం 19,919 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.743 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.640 కోట్లే చెల్లించారు. మిగిలిన రూ.103 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి.
దీంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా బకాయిలు వెంటనే చెల్లించేందుకు సివిల్ సప్లయిస్ డీఎం అప్రూవల్ లెటర్ పంపినా ఇప్పటికీ నిధులు విడుదల కాలేదని సమాచారం. అసలే సాగు ఖర్చు పెరిగి, ప్రైవేటు అప్పులు, బ్యాంకు లోన్లతో పంట పండిస్తే ఇలా బకాయిలు నిలిచిపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు వెంటనే నగదు చెల్లించే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
నాలుగైదు రోజుల్లో చెల్లిస్తాం.. రోజ్‌మాండ్, జిల్లా మేనేజర్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.640 కోట్ల మేర చెల్లింపులు చేశాం. మిగతా చెల్లింపులకు సంబంధించి డీఎం అప్రూవల్ లెటర్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు పంపాం. నాలుగైదు రోజుల్లో ఈ చెల్లింపులు పూర్తి చేసేస్తాం.