కరోనా దెబ్బకు ‘ఖజానా’ కుదేలు!

ABN , First Publish Date - 2020-07-15T10:24:50+05:30 IST

కరోనా దెబ్బకు ప్రజలే కాదు ప్రభుత్వ ఖజానా కూడా విలవిల్లాడుతోంది. కేవలం గడచిన మూడు నెలల కాలానికి..

కరోనా దెబ్బకు  ‘ఖజానా’ కుదేలు!

3 నెలలు.. 4 శాఖలు.. రూ.335 కోట్ల నష్టం

భారీగా పడిపోయిన ప్రభుత్వ ఆదాయం

వాణిజ్య పన్నుల శాఖలోనే రూ.142 కోట్లు

మందు అమ్మకాల్లోనూ 120 కోట్ల వాతే!

రవాణా, రిజిస్ర్టేషన్లలో రూ.73 కోట్లు


నెల్లూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : కరోనా దెబ్బకు ప్రజలే కాదు ప్రభుత్వ ఖజానా కూడా విలవిల్లాడుతోంది. కేవలం గడచిన మూడు నెలల కాలానికి అక్షరాల రూ.335 కోట్ల రాబడి తగ్గిపోయింది. ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయాన్ని సమకూర్చే నాలుగు ప్రధాన శాఖలు బాగా నీరసించిపోయాయి. లక్ష్యంలో కనీసం 20 శాతం కూడా ప్రగతి సాధించలేకపోయాయి. 


రాష్ట్ర ఆదాయంలో వాణిజ్య పన్నుల శాఖ వాటా 50 శాతంపైనే. ఇంత కీలకమైన ఈ శాఖకు కరోనా కారణంగా గడచిన మూడు నెలల కాలంలో రూ.142 కోట్ల రాబడి తగ్గిపోయింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం ఆరంభమైంది. మొదటి త్రైమాసికంలో అంటే ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో కరోనా కారణంగా వాణిజ్యపన్నుల శాఖ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. 2019, ఏప్రిల్‌ నెలలో జిల్లా నుంచి పన్నుల రూపంలో ఈ శాఖకు వచ్చిన ఆదాయం రూ.81.09 కోట్లు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ నెల ఆదాయం కేవలం 17.23 కోట్లు మాత్రమే. గత ఏడాది మే నెలలో 84 కోట్ల ఆదాయం రాగా ఏడాది మే నెలలో 34.89 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. లాక్‌డౌన్‌లో మినహాయింపుల కారణంగా జూన్‌లో కొంత పుంజుకుని రూ.53.76 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోల్చితే గడిచిన మూడు నెలల కాలంలో వాణిజ్యపన్నుల శాఖ రూ.142 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఏప్రిల్‌, మే నెలలు సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా నిత్యావసర సరుకుల దుకాణాలు తప్ప మిగిలిన అన్ని వ్యాపార లావాదేవీలు బంద్‌ అయ్యాయి. ఈ కారణంగా ఆదాయం గణనీయంగా తగ్గింది. 


తగ్గిన మందు ఆదాయం

లాక్‌డౌన్‌ కారణంగా జిల్లా పరిధిలో ఎక్సైజ్‌ శాఖ గడచిన మూడు నెలల కాలంలో రూ.120 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. 2020, జనవరిలో మద్యం  అమ్మకాల విలువ రూ.137.70 కోట్లు. ఫిబ్రవరిలో రూ.125.20కోట్లు. మార్చిలో 110.61 కోట్లు. అంటే సగటున నెలకు రూ.120 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతూ వచ్చాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌ నెల పూర్తిగా మద్యం దుకాణాలు మూసివేశారు. మే నెలలో  110 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఆ నెలలో నష్టం ఏమి లేదు. ఇక జూన్‌ నెలలో అమ్మకాలు 128 కోట్లు. ఆ నెల రావాల్సిన ఆదాయం వచ్చింది. షాపులు పూర్తిగా బంద్‌ అయిన ఏప్రిల్‌ నెలకు సంబందించి మాత్రం ఈ శాఖ 120 కోట్ల అమ్మకాలను నష్టపోయింది. 


‘రవాణా’లో రూ.44 కోట్ల కోత

ప్రభుత్వ ఆదాయ శాఖల్లో రోడ్డు రవాణా శాఖ పాత్ర కీలకం. 2020-21 ఆర్థిక సంవత్సరం లక్ష్యం 278 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఆర్థిక సంవత్సరం ఆరంభం అయ్యింది. లాక్‌డౌన్‌ కారణంగా గడచిన మూడు నెలల (మొదటి త్రైమాసికం) కాలంలో ఈ శాఖ ఆదాయంలో 44 కోట్ల కోత పడింది. మొదటి త్రైమాసికానికి అంటే ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల కాలానికి రూ.70 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.


అయితే జూన్‌ 30వ తేది నాటికి ఈ శాఖకు కేవలం 26 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. లాక్‌ డౌన్‌ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో ఈ పరిస్థితి ఎదురయ్యింది. ఈ శాఖ ఆదాయంలో చలానాలది అగ్రభాగం. వాహనాల తనిఖీ  ద్వారా జరిమానా వసూలు చేసే పద్ధతిని చలానాలు అంటారు. వాహనాల రాకపోకలే స్తంభించిపోవడంతో ఈ విభాగంలో ఆదాయం తగ్గిపోయింది. సర్వీసు చార్జీల ఆదాయంలో 65 శాతం, లైఫ్‌ ట్యాక్స్‌ విభాగంలో 68శాతం, క్వార్టర్లీ ట్యాక్సులు విభాగంలో 50 శాతం ఆదాయానికి కోత పడింది. 


రిజిస్ట్రేషన్‌లో రూ. 29 కోట్లు కట్‌

రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల కాలానికి రూ.44 కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకోగా అందులో 29 కోట్ల కోత పడింది. ఏప్రిల్‌ నెల టార్గెట్‌ 18.39 కోట్లు కాగా ఈ నెల పూర్తిగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్న కారణంగా ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. మే నెల టార్గెట్‌ 16.09 కోట్లు కాగా కేవలం 6.11 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. జూన్‌  టార్గెట్‌ 18.39 కోట్లు కాగా 17.19 కోట్లు ఆదాయం వచ్చింది.


గడిచిన 3 నెలల్లో ప్రభుత్వ శాఖల ఆదాయం (రూ.కోట్లలో)

శాఖ ఏప్రిల్‌ మే జూన్‌

వాణిజ్య పన్నులు 17.23 34.89 53.76

ఎక్సైజ్‌ - 110 128

రవాణా - - 26

రిజిస్ట్రేషన్‌ - 6.11 17.19

Updated Date - 2020-07-15T10:24:50+05:30 IST