వేములపాడులో భయం.. భయం
ABN , First Publish Date - 2020-12-12T04:47:06+05:30 IST
ప్రశాంత పల్లె ఒక్కసారిగా అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. అధికార వైసీపీలో ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన విభేదాలు చివరకు ఘర్షణకు దారి తీసింది.
కొట్టుకున్న వైసీపీలో ఇరువర్గాలు
రాత్రంతా అరుపులు, కొట్లాట
పలువురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
పోలీస్ పహారాలో ఎస్సీ కాలనీ
ట్రైనీ ఎస్పీ, కావలి డీఎస్పీల పర్యటన
జలదంకి, డిసెంబరు 11 : ప్రశాంత పల్లె ఒక్కసారిగా అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. అధికార వైసీపీలో ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన విభేదాలు చివరకు ఘర్షణకు దారి తీసింది. నువ్వా.. నేనా అన్నట్టు గొడవకు దిగడంతో ప్రజలు భీతిల్లిపోయారు. చివరకు పోలీసులు వచ్చి సర్ది చెప్పినా వినకపోవడంతో అదనపు బలగాలను రంగంలోకి దించారు. వేములపాడులో గురువారం జరిగిన ఈ ఘటన జలదంకి మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
గ్రామంలో వలంటీరు పోస్టుల భర్తీ, సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక విషయంలో వైసీపీకి చెందిన కావ్య కృష్ణారెడ్డి, చేవూరు జనార్ధన్‌రెడ్డిల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. తాజాగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తికి ఎకరా పొలం ఇచ్చారు. అయితే, దారి, కాలువ విషయంలో రేగిన గొడవ గురువారం రాత్రి వివాదానికి దారి తీసింది. చివరకు ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన చేవూరి రమణయ్య అలియాస్ రోశయ్య, చేవూరి సుబ్రహ్మణ్యం, మొద్దు రవి, మొద్దు సరితలకు గాయాలు అయ్యాయి. వీరిలో రోశయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నెల్లూరు, అక్కడి నుంచి చెన్నైకు తరలించారు.విషయం తెలుసుకున్న జలదంకి ఎస్‌ఐ వెంకట్రావు తన సిబ్బందితో కలిసి హుటాహుటిన గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వీరి మాట వినని ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడంతో పరిస్థితి చేయిదాటే క్రమంలో ఎస్‌ఐ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే కావలి డీఎస్పీ ప్రసాద్ బోగోలు, కావలి రూరల్ పోలీసులను రంగంలోకి దించారు. కావలిరూరల్ సీఐ అక్కేశ్వరరావు ఆధ్వర్యంలో జలదంకి, కావలిరూరల్, బోగోలు ఎస్‌ఐలు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
గ్రామంలో భయం.. భయం
ఇరువర్గాల మధ్య అరుపులు, కేకల దాటికి చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు భీతిల్లిపోయారు. ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఏ క్షణాన ఏం జరుగుతుందోనని రాత్రంతా కాలం వెళ్లదీశారు. చివరకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చాక ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి గ్రామంలో శాంతిచర్యలపై పోలీసు అధికారులతో మాట్లాడినట్లు తెలిసింది.
గ్రామంలో పోలీస్ పికెట్
ట్రైనీ ఎస్పీ మహేశ్వరరెడ్డి, కావలి డీఎస్సీ శుక్రవారం గ్రామంలో పర్యటించి ఇరువర్గాలకు చెందిన వారితో చర్చించి ఎలాంటి గొడవలకు పాల్పడవద్దని, ఘర్షణలకు దిగితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎస్సీకాలనీ పోలీసు పహారాలో ఉంది. ఇదిలా ఉండగా గ్రామంలో ఎలాంటి ఘర్షణలు చేటు చేసుకోకుండా చూడాలని పలువురు మహిళలు పోలీసులను వేడుకున్నారు.