ఇళ్ల స్థలాలు కావాలన్నందుకు.. దళిత కుటుంబాల బహిష్కరణ

ABN , First Publish Date - 2020-08-15T09:15:24+05:30 IST

తమకు ఇళ్ల స్థలాలు కావాలని కోరినందుకు పది కుటుంబాలకు చెందిన దళితులను కాలనీ పెద్దలు శుక్రవారం బహిష్కరించారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాళెం దళితకాలనీకి చెందిన పది కుటుంబాలు ఇళ్ల స్థ

ఇళ్ల స్థలాలు కావాలన్నందుకు.. దళిత కుటుంబాల బహిష్కరణ

తలారి కుటుంబానికి రూ.10వేల జరిమానా

కట్టుబాట్లు కాదన్నందుకు కాలనీ పెద్దల నిర్ణయం

సచివాలయం వద్ద బాధితుల ఆందోళన

తహసీల్దారు చర్చలతో అలా చేయలేదని సమాధానం


మనుబోలు, ఆగస్టు 14 : తమకు ఇళ్ల స్థలాలు కావాలని కోరినందుకు పది కుటుంబాలకు చెందిన దళితులను కాలనీ పెద్దలు శుక్రవారం బహిష్కరించారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాళెం దళితకాలనీకి చెందిన పది కుటుంబాలు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులపై సంతకాలు చేశాయి. మిగతా వారు వద్దని తిరస్కరించారు. కాలనీ కట్టుబాటు మేరకు నడుచుకోలేదనే కారణంతో పెద్దలు ఆ పది కుటుంబాలతో మిగతా వారు మాట్లాడకూడదని, దుకాణాల్లో సరుకులు ఇవ్వకూడదని, వారితో కలిసి పనులకు వెళ్లకూడదని ఓ వ్యక్తి ద్వారా గురువారం రాత్రి చాటింపు వేయించారు.


కాలనీ కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఉందని తలారి కుటుంబానికి రూ.10వేలు జరిమానా విధించారు కూడా. దీనిని నిరసిస్తూ ఆ పది కుటుంబాలు గ్రామ సచివాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశాయి. విషయం తెలుసుకున్న తహసీల్దారు నాగరాజు, పోలీసులు అక్కడకు చేరుకుని, దళితులతో మాట్లాడారు. తహసీల్దారు కాలనీ పెద్దలను పిలిపించి, మాట్లాడారు. కొందరు నాయకులు దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. మాట్లాడటం, మాట్లాడకపోవడం వారి వ్యక్తిగతమన్నారు. ఇష్టముంటే మాట్లాడతారు, లేకపోతే  లేదన్నారు. తాము ఎవరినీ బహిష్కరించలేదని, ఎవరికి జరిమానా వేయలేదని స్పష్టం చేశారు. దీంతో తహసీల్దార్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఎవరూ ఎవరినీ బహిష్కరించే హక్కులు లేవన్నారు. ఇళ్లస్థలాలు అవసరమున్న  వారు తీసుకుంటే తప్పేముందన్నారు.


తప్పు చేస్తే శిక్షించేందుకు కోర్టులు ఉన్నాయని, జరిమానా వేసే అధికారం ఎవరికీ లేదన్నారు. ఎవరినైనా ఇబ్బందులకు గురిచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట వీఆర్‌వో నాగేశ్వరరావు, ఏఎ్‌సఐలు ప్రసాద్‌, సుదాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-15T09:15:24+05:30 IST