నివర్‌.. అపారం!

ABN , First Publish Date - 2020-12-18T05:16:29+05:30 IST

జిల్లాలో నివర్‌ తుఫాన్‌ బీభత్సంతో రూ.618.53 కోట్ల మేర నష్టం సంభవించిందని కేంద్ర బృందానికి కలెక్టర్‌ చక్రధర్‌బాబు వివరించారు.

నివర్‌.. అపారం!
విడవలూరు : వరద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం

జిల్లాలో రూ.618 కోట్ల నష్టం

పంచాయతీ రాజ్‌కే రూ.313 కోట్లు

కేంద్ర బృందానికి వివరించిన కలెక్టర్‌

గూడూరు, విడవలూరు, బోగోలులో పర్యటన 

జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని పలువురి వినతి


నెల్లూరు(జడ్పీ), డిసెంబరు 17 : జిల్లాలో నివర్‌ తుఫాన్‌ బీభత్సంతో రూ.618.53 కోట్ల మేర నష్టం సంభవించిందని కేంద్ర బృందానికి కలెక్టర్‌ చక్రధర్‌బాబు వివరించారు. జిల్లాలో తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం సభ్యులు డాక్టర్‌ పొన్నుస్వామి, శ్రావణ్‌కుమార్‌ సింగ్‌, ఆర్‌పీ దూబే గురువారం జిల్లాకు చేరుకున్నారు. గూడూరు, విడవలూరు తదితర ప్రాంతాల్లో పర్యటించిన బృందం సభ్యులు జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. నెల్లూరులోని జడ్పీ సమావేశ మందిరంలో  కలెక్టర్‌, అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో జరిగిన వరద నష్టంపై కలెక్టర్‌ కేంద్రబృందానికి ఫొటోలతో వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తుఫాన్‌ కారణంగా అన్ని శాఖలకు సంబంధించి రూ.618.53 కోట్ల నష్టం జరిగినట్లు తెలిపారు. పంచాయతీ రాజ్‌ శాఖకు రూ.313.17కోట్లు, జలవనరుల శాఖకు రూ.202 కోట్లు, రోడ్ల భవనాల శాఖకు రూ.54.65కోట్లు వ్యవసాయ శాఖకు రూ.24.56కోట్లు ఉద్యాన శాఖకు రూ.5.63కోట్లు, పురపాలకశాఖకు రూ.9కోట్లు, విద్యుత్‌ శాఖకు రూ.5.26కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు రూ.2.3కోట్లతోపాటు పశుసంవర్దకశాఖ, మత్స్యశాఖ, గృహనిర్మాణ శాఖలకు కొంతమేర నష్టం జరిగిందని తెలిపారు. తుఫాన్‌లకు ప్రాణ నష్టం జరగకుండా 155 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలకు చెందిన 17,163 మందిని ముందస్తుగా తరలించి వారికి సౌకర్యాలు కల్పించామని చెప్పారు. ఈ సమావేశంలో  జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌, ఇన్‌చార్జి డీఆర్‌వో నాగలక్ష్మి, జడ్పీ సీఈవో సుశీల, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 


కేంద్ర బృందానికి సీపీఐ వినతి

నెల్లూరు (వైద్యం) : జిల్లాలో తుఫాన్ల ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ నేతలు కేంద్ర పరిశీలన బృందానికి వినతిపత్రం అందించారు. గురువారం నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో కేంద్ర బృందాన్ని నేతలు నేతలను కలిశారు. జిల్లాలో నారుమళ్లు, అరటితోటలు, ఉద్యాన పంటలకు తీవ్రనష్టం వాటిల్లినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రూ.500 కోట్లు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, రామరాజు తదితరులు పాల్గొన్నారు.


రైతాంగాన్ని ఆదుకోండి

నెల్లూరు(వ్యవసాయం) : నివర్‌, బురేవి తుఫాన్లతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘాల సమాఖ్య నాయకులు కేంద్రబృందం, కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సమాఖ్య నాయకులు చిరసారి కోటిరెడ్డి, ఎవిఆర్‌ నాయుడు, సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


కేంద్ర బృందానికి ఘన స్వాగతం

నాయుడుపేట/గూడూరు(రూరల్‌)/విడవలూరు : జిల్లాలో నివర్‌ తుఫాన్‌ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందానికి జేసీ హరీంద్రప్రసాద్‌ నాయుడుపేట వద్ద స్వాగతం పలికారు. ఈ బృందంలో పొన్నుస్వామి, శర్వన్‌కుమార్‌సింగ్‌, ఆర్‌పీ దూబే, సుభానీ, అంజాద్‌ఖాన్‌, బషీర్‌ ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఆర్డీవో సరోజిని, నాయుడుపేట సీఐ వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు. గూడూరు  గూడూరు సమీపంలో దెబ్బతిన్న జాతీయ రహదారిని కేంద్ర బృందం పరిశీలించింది.  జేసీ హరేందిరప్రసాద్‌ దెబ్బతిన్న హైవే వివరాలను వారికి వివరించారు. సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ కూడా ఉన్నారు. విడవలూరు మండల పరిధిలోని పల్లిపాళెం వద్ద నున్న వంతెన, రొయ్యల గుంతలను, దెబ్బతిన్న రోడ్లను  కేంద్ర బృందం పరిశీలించింది. బోగోలు మండలంలో ముంగమూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు, నీట మునిగిన కోవూరుపల్లిని పరిశీలించింది.


Updated Date - 2020-12-18T05:16:29+05:30 IST