అస్సాం వాసిని బతికించిన జీజీహెచ్‌ వైద్యులు

ABN , First Publish Date - 2020-03-04T09:48:57+05:30 IST

రైలు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి వచ్చిన అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తిని

అస్సాం వాసిని బతికించిన జీజీహెచ్‌ వైద్యులు

రైలు ప్రమాద బాధితుడికి ఐదు శస్త్రచికిత్సలు

పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేసిన వైద్యులు

జీజీహెచ్‌ సూపరింటెండ్‌, కమిటీ సమన్వయకర్త


నెల్లూరు(వైద్యం), మార్చి 3 : రైలు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి వచ్చిన అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తిని జీజీహెచ్‌ వైద్యులు అత్యాధునిక వైద్య చికిత్స అందించి బతికించారు. బాధితుడు కోలుకోవటంతో మంగళవారం డిశ్చార్జి చేశారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమన్వయకర్త లక్ష్మిసునంద, పలువురు సభ్యులు అతడిని పరామర్శించి వైద్య బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో లక్ష్మిసునంద, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సాంబశివరావు, ఆర్థోపెడిక్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ మస్తాన్‌బాషా మాట్లాడారు.


ఫిబ్రవరి 17వ తేదీన బెంగుళూరు నుంచి అస్సాం వెళుతున్న అరవింద్‌ సేనాపతి(35)ను నాయుడుపేట వద్ద కొందరు రైలు నుంచి తోసి వేయటంతో తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. ఐదు చోట్ల ఎముకలు విరిగి ప్రాణాపాయ స్థితిలో జీజీహెచ్‌కు వచ్చాడన్నారు. పూర్తి పరీక్షల అనంతరం అతడికి ఎముకలు విరిగిన ఐదు చోట్ల శస్త్రచికిత్స చేసి సరి చేయాల్సి ఉందని నిర్ధారించామన్నారు. ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న పనని, ఒకే సారి ఐదు చోట్ల శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందన్నారు.


ఇందుకు చాలా శ్రమించాల్సి ఉందని తెలిసి కూడా ఆసుపత్రి సిబ్బంది ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని ఎనిమిది గంటలు నిరంతరాయంగా శ్రమించి ఒకేసారి ఐదు చోట్ల శస్త్రచికిత్స విజయవంతంగా చేశామన్నారు. బాధితుడు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని, డిశ్చార్జి కూడా చేస్తున్నామని వారు తెలిపారు. జీజీహెచ్‌లో ఉన్న ఆధునిక వసతి సౌకర్యాలతో ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని వారన్నారు. ఈ సమావేశంలో అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీనివాసులు, బ్రహ్మరెడ్డి, అభిషేక్‌రెడ్డి, అడ్మినిస్ట్రేటర్‌ డాక్టర్‌ కళారాణి, డాక్టర్‌ నిర్మలాదేవి, డాక్టర్‌ భాస్కర్‌, డాక్టర్‌ మ న్యూరెల్లా, డాక్టర్‌ సుబ్బారావు, డాక్టర్‌ ఫైజున్నీసా, డాక్టర్‌ దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-04T09:48:57+05:30 IST