సమర్థ్ధవంతంగా ఎదుర్కొన్నాం : కలెక్టర్
ABN , First Publish Date - 2020-11-27T05:21:07+05:30 IST
ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో ‘నివర్’ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నట్లు కలెక్టర్ చక్రధర్‌బాబు చెప్పారు.

నెల్లూరు (హరనాథపురం), నవంబరు 26 : ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో ‘నివర్’ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నట్లు కలెక్టర్ చక్రధర్‌బాబు చెప్పారు. గురువారం కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని చెప్పారు. గ్రామాల వారీగా అధికారుల తో బృందాలు ఏర్పాటు చేసి, తుఫాన్ వల్ల కలిగిన పంట నష్టం అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. 3,650 బోట్లను వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని, సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 115 పునరావాస కేంద్రాలు ఏర్పా టు చేసి, 3353 మందికి ఆశ్రయం కల్పించామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెం దిన 5వేల మంది సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 100 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు చెప్పా రు. టోల్ ఫ్రీ నెంబర్‌కు వచ్చిన ప్రతి కాల్‌కు క్విక్ రెస్పాన్స్ టీములు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నాయన్నారు. గురువారం ఉదయం 89 చెట్లు నేల కూలాయని, 2 చెరువుల కట్టలు దెబ్బతిన్నాయని, కొన్ని చోట్ల చెట్లుపడి విద్యుత్ స్తం భాలు నేలకూలాయని చెప్పారు. నెల్లూరు, గూడూరు, బుచ్చిరెడ్డిపాళెం పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలిపారు. సోమశిల ప్రాజెక్టు నుంచి గురువారం వరకు సుమారు 2 లక్షల టీఎంసీలకుపైగా వరదను సముద్రంలోకి పంపించామని తెలిపారు. తుఫాన్ తీరం దాటినా మరో 2రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల పెన్నా పరివాహక ప్రాంతంలోని 12 మండలాలల్లోని అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
రానున్న 2 రోజులూ వర్షాలే
తుఫాన్ తీరం దాటినా రానున్న రెండురోజులపాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ చక్రధర్‌బాబు అన్నారు. గురువారం జడ్పీలోని డీఈఓసీ నుంచి తుఫాన్ ప్రభావిత ప్రాంత జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ షెల్టర్లలో ఉన్నవారికి భోజనం, పాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిండుగా ఉన్న చెరువుల కట్టలను పరిశీలించి, బలహీనంగా ఉన్న చోట తక్షణమే మరమ్మతు చేపట్టాలన్నారు. గ్రామాల వారీగా వీఆర్ఏ, వీఏఓ, పంచాయతీ అధికారి, వీఆర్ఓలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పంట నష్టం అంచనాలపై నివేదిక తయారు చేయాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జేసీలు హరేందిరప్రసాద్, ఎన్.ప్రభాకర్‌రెడ్డి, సూర్యప్రకాష్ డీఆర్వో ఎంవీ రమణ తదితరులు పాల్గొన్నారు.