ఫిబ్రవరిలో ప్రతిభాన్వేషణ పరీక్షలు: డీఈవో
ABN , First Publish Date - 2020-12-30T05:18:11+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిభాన్వేషణ పరీక్షలు వచ్చేఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయని డీఈవో పీ రమేష్ తెలిపారు.
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), డిసెంబరు 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిభాన్వేషణ పరీక్షలు వచ్చేఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయని డీఈవో పీ రమేష్ తెలిపారు. కౌశల్ పేరుతో ఏటా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కౌశల్-2020-21 గోడ పత్రికను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆవిష్కరించారు. విద్యార్థుల్లో దాగిన సృజనను వెలికితీసే ఈ పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు, సైన్సు, గణిత ఉపాధ్యాయులు చొరవ చూపాలని కోరారు. కౌశల్ రాష్ట్ర కన్వీనర్ పూడి ప్రసాద్, జిల్లా కన్వీనర్ ఆర్‌ఆర్‌ఎస్ ప్రసాద్, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ మురళీధర్ మాట్లాడుతూ ప్రభుత్వరంగ పాఠశాలల్లో 8,9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి గల వారు వెబ్‌సైట్ ద్వారా 2021 జనవరి 31వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రాథమిక స్థాయిలో ఫిబ్రవరి 9న ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుందన్నారు. అందులో ప్రతిభ చూపిన వారికి జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 16న, దానిలో విజయం సాధించిన వారికి రాష్ట్రస్థాయిలో ఫిబ్రవరి 27న పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాస్థాయి విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలతోపాటు నగదు బహుమతులు అందజేస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు రాష్ట్ర గవర్నర్ బహుమతులు అందిస్తారని తెలిపారు.