-
-
Home » Andhra Pradesh » Nellore » Fear of corona
-
భయంకరోనా!
ABN , First Publish Date - 2020-03-13T09:49:34+05:30 IST
జిల్లా వాసులను గత మూడురోజులుగా కలవర పెడుతున్న కరోనా అనుమానిత కేసు చిక్కుముడి వీడింది. ఇటలీ నుంచి నెల్లూరు

ఇటలీ నుంచి వచ్చిన విద్యార్థికి పాజిటివ్
నిర్థారించిన పూణే వైరాలజీ ల్యాబ్
రాష్ట్రంలోనే తొలికేసుగా నిర్థారణ
అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్
వైద్య ఆరోగ్యశాఖకు పలు ఆదేశాలు
ఇద్దరు జేడీల ప్రత్యేక పర్యవేక్షణ
వైద్యశాఖ పరిశీలనలో 150 మంది
జీజీహెచ్ ఐసోలేషన్ వార్డులో 9 మంది...
ఆందోళన చెందుతున్న జిల్లా ప్రజానీకం
నెల్లూరు(ఆంధ్రజ్యోతి): కరోనా.. సింహపురీయులనూ వణికిస్తోంది. ఇటీవల ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన విద్యార్థికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. దీంతో ఒక్కసారిగా జిల్లా ఉలిక్కి పడింది. రాష్ట్రంలో తొలికేసు ఇక్కడిదే కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 150 మంది కరోనా అనుమానితులు వైద్యుల పర్యవేక్షణలో ఉండగా 9 మంది జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంకా వైరస్ వ్యాప్తి చెందకుండా కలెక్టర్ ఎంవీ.శేషగిరిబాబు తక్షణ చర్యలకు పూనుకున్నారు. అధికారులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. సినిమా హాళ్లు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. వైరస్‌పై ఇరవై మంది వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. కాగా, నెల్లూరులో 40 బృందాలు ఇంటింటా తిరుగుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నాయి.
జిల్లా వాసులను గత మూడురోజులుగా కలవర పెడుతున్న కరోనా అనుమానిత కేసు చిక్కుముడి వీడింది. ఇటలీ నుంచి నెల్లూరు నగరానికి వచ్చిన విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఒక్కసారిగా జిల్లా ఉలిక్కి పడింది. రాష్ట్రంలోనే ఇది తొలికేసుగా నిర్థారణ కావటం జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. నెల్లారు నగరానికి చెందిన విద్యార్థి ఇటలీలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఈ నెల 6వ తేదీన నెల్లూరుకు వచ్చారు. అయితే కరోనా లక్షణాలు ఉండటంతో ఆ విద్యార్థిని ఈ నెల 9వ తేదీన నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్చారు.
బాధితుని నుంచి స్వాబ్ తీసి పరీక్షల కోసం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ పాజిటివ్ ఉన్నట్లు నిర్థారణ అయింది. అయితే మరింత లోతైన పరిశీలన కోసం ఈ నెల 10వ తేదీన పూణే వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఆ పరీక్ష ఫలితాలు గురువారం వచ్చాయి. ఆ విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావటంతో వైద్య వర్గాలతోపాటు, జిల్లా ప్రజలలో ఆందోళన మొదలైంది. జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ప్రత్యేక దృష్టి పెట్టి వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలలో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించేలా చర్యలు తీసుకున్నారు.
సినిమాహాళ్లు మూసివేత
కరోనా కేసు నేపథ్యంలో కలెక్టర్ పలు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం రాత్రి ఆయన క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులు, వైద్య నిపుణులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించారు. అవసరమైన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు గుంపులుగా ఉండరాదని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఇటలీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా మొత్తం అప్రమత్తం చేశామని, నెల్లూరులోని సినిమా హాళ్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించామన్నారు. హోటళ్లు, మాల్స్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేలా పోస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇంటింటి సర్వే జరుగుతోందని, విదేశాల నుంచి వచ్చిన వారికి ఇళ్ల వద్దనే హోం ఐసోలేషన్ చేస్తున్నట్లు చెప్పారు. కరోనా లక్షణాలున్న వ్యక్తులు 14 రోజులపాటు ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు. నెల్లూరులోని ఓ ప్రైవేటు హోటల్‌లో విదేశీయుల బృందం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారి వద్ద ప్రత్యేక వైద్య బృందం ఉందని తెలిపారు. అయితే వారిలో ఎవరికీ కూడా కరోనా లక్షణాలు లేవని గుర్తించామని చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామని, తదుపరి వారి ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతామని తెలిపారు. అవసరమైన మాస్క్‌లు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వివరించారు.
ఐసోలేషన్ వార్డులో 9 మంది
నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో 9 మంది కరోనా అనుమానితులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు పొందుతున్నారు. వీరిలో ఒక విద్యార్థికి కరోనా సోకినట్లు నిర్థారణ కావటంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ప్రత్యేక చర్యలకు సిద్ధమయ్యారు. ఐసోలేషన్ వార్డు ఉన్న విభాగంలోకి బయట వ్యక్తులు ఎవ్వరూ వెళ్లకుండా నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థి తల్లిదండ్రులతో పాటు డ్రైవర్, క్లీనర్, పనిమనిషి, ఆమె కుమారుడిని, విదేశాల నుంచి వచ్చిన మరో యువకుడిని కూడా తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వీరితో పాటు ఇటలీ నుంచి వచ్చిన మరో వ్యక్తిని కూడా ఐసోలేషన్ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
వైద్యుల పర్యవేక్షణలో 150 మంది
కరోనా ప్రభావం దేశంలోకి ప్రవేశించటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమ య్యాయి. గత నెల రోజుల్లో వివిధ దేశాల నుంచి నెల్లూరు జిల్లాకు వచ్చిన వారి వివరాలు వైద్య ఆరోగ్యశాఖ సేకరించింది. వీరందరు వైద్యుల పర్యవేక్షణలో ఉండగా వీరెవరికి కరోనా వ్యాధి నిర్థారణ కాలేదు. కేవలం నెల్లూరుకు చెందిన విద్యార్థికి మాత్రమే ఈ లక్షణాలు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరు మాత్రమే ఐసోలేషన్ వార్డులో ఉండగా మిగిలిన వారంతా ఇంటి నుంచి బయటకు రాకుండా తగిన చర్యలు తీసుకున్నారు.
ఆయా ప్రాంతాలు పీహెచ్‌సీ, సీహెచ్‌సీల వైద్యులు బాధితుల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మొత్తం 28 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉండటంతో ఆ దిశగా వైద్యశాఖ చర్యలు తీసుకుంటోంది.
అధికారులు, సిబ్బంది అప్రమత్తం
కరోనా ప్రభావం జిల్లాపై పడటంతో అధికారులు సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి కార్యాచరణ రూపొందించారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గ్రామ వలంటీర్లను నియమించి ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుంటే ప్రస్తుతం వారి పరిస్థితి ఏమిటీ అన్న వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యేకించి 40 బృందాలు నెల్లూరు నగరంలో ఇంటింటికి తిరుగుతూ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నాయి.
ఎవరైనా దీర్ఘకాలికంగా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, జ్వరం, జలుబు ఉంటే ఉన్నతాధికారులకు నివేదించేలా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు నెల్లూరుకు చేరుకుని కరోనా ప్రభావ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో నెల్లూరులోని సినిమా హాళ్ల యాజమాన్యాలు రెండు రోజులు థియేటర్లను మూసివేయాలని నిర్ణయించాయి.
మర్లపూడిలో కరోనా పుకార్లు
సైదాపురం మండలం మర్లపూడి గ్రామంలో ఓ మహిళను కరోనా లక్షణాలతో నెల్లూరుకు తరలించారంటూ ఓ వార్త గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మర్లపూడి గ్రామానికి చెందిన 29 ఏళ్ల ఓ వివాహిత కువైట్ నుంచి గత నెల 19న స్వగ్రామం చేరుకుంది. మండలంలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేసే క్రమంలో ఆ మహిళల రెండు రోజులుగా జ లుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నెల్లూరు నుంచి డాక్టర్ జెడ్ రమేష్ బృందం మర్లపూడికి చేరుకుని ఆ మహిళకు వైద్య పరీక్షలు చేశారు. మహిళలో కరోనా లక్షణా లు లేవని తేల్చారు. దీంతో గ్రామస్థులు, మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
జాగ్రత్తలతో ఆరోగ్యం పదిలం
కరోనా వైరస్ మనిషి మనుగడనే ప్రశ్నిస్తోంది. ఈ వ్యాధికి ఇప్పటి వరకు ఎలాంటి మందులు, వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులో లేకపోవటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరులో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవడం అత్యవసరం.
వ్యాధి లక్షణాలు...
శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం
ఎక్కువ దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు
అధిక విరోచనాలు, గొంతు నొప్పి, తలనొప్పి
నివారణ ఇలా...
చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
ఎక్కువ నీటిని, ద్రవ పదార్థాలను తీసుకోవాలి
నోటికి, ముక్కుకు మాస్క్‌లు ధరించాలి
సంపూర్ణ విశ్రాంతి తీసుకోవాలి
దగ్గినప్పుడు, తుమ్మిన తరువాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఫ వ్యాధిగ్రస్తులు బయట తిరగకుండా ఉంటే మంచిది.
ఇవి వద్దు...
ఇతరులు కలిసినప్పుడు చేతులు కలపడం(షేక్‌హ్యాండ్), కౌగిలించుకోవడం చేయవద్దు.
జనసమర్దం ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దు
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు
డాక్టర్ సలహా లేకుండా మందులు వేసుకోరాదు.