పేరు రైతులది.. పెత్తనం కార్పొరేట్‌ సంస్థలది

ABN , First Publish Date - 2020-12-28T04:20:39+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు పేరుకే రైతులదని, పెత్తనం కార్పొరేట్‌ సంస్థల ఆధీనంలో ఉంటుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీ.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

పేరు రైతులది.. పెత్తనం కార్పొరేట్‌ సంస్థలది
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాసరావు

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు

ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 27: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు పేరుకే రైతులదని, పెత్తనం కార్పొరేట్‌ సంస్థల ఆధీనంలో ఉంటుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీ.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సిండికేట్‌ బ్యాంకు ఆవరణలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ, విద్యుత్‌ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఈ సమస్య జాతీయ సమస్యని, ఊరూరా ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. వైసీపీ, టీడీపీలు చట్టాలకు మద్దతివ్వడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా వారు రైతుల కోసం పోరాడాలన్నారు. గిట్టుబాటు ధర, రుణ విమోచనలాంటి చట్టాలను అమలు చేయాలన్నారు. వ్యవసాయ మీటర్లకు విద్యుత్‌ మీటర్లు బిగిస్తే రైతుల మెడకు ఉరితాళ్లు బిగించినట్లేనన్నారు. ఉచిత విద్యుత్‌ పథకంలో నగదు బదిలీ ఏమిటని ప్రశ్నించారు. నూతన మీటర్ల ఏర్పాటుతో ప్రభుత్వంపై రూ.2 వేల కోట్లు భారం పడనుందన్నారు. మార్కెట్‌ సెస్సుల రద్దుతో ప్రభుత్వాలు ఆదాయాన్ని కోల్పోయాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి వ్యవసాయ, విద్యుత్‌ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌, వ్యవసాయ, కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య, జిల్లా రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య, నాయకులు కోడె రమణయ్య, బయ్యన్న, ఫరుద్దీన్‌బాషా, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T04:20:39+05:30 IST