కట్టడి చేసేనా..?

ABN , First Publish Date - 2020-05-18T10:06:40+05:30 IST

లాక్‌డౌన్‌ ప్రారంభం అయినప్పటి నుంచి పోలీసుల సేవలు అభినందనీయమని జిల్లా ప్రజలు

కట్టడి చేసేనా..?

లాక్‌డౌన్‌ సమయంలో పోలీసుల చేతివాటం

ఆదాయ వనరులుగా పేకాట స్థావరాలు

కేసుల పేరుతో దుకాణ యజమానులకు బెదిరింపు

వాహనాల సీజ్‌లోనూ ఇదే తంతు

గుంటూరు తరహాలో ప్రత్యేక నిఘా ఉందా ?

కొంతమంది పోలీసులతో విసిగిపోతున్న ప్రజలు


నెల్లూరు(క్రైం),మే 17: లాక్‌డౌన్‌ ప్రారంభం అయినప్పటి నుంచి పోలీసుల సేవలు అభినందనీయమని జిల్లా ప్రజలు కొనియాడుతున్నారు. అయితే జిల్లాలో కొంతమంది పోలీసులు మాత్రం కరోనా సమయంలోనూ చేతివాటం  ప్రదర్శిస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. గుంటూరు జిల్లాలో లాక్‌డౌన్‌ సమయంలో అక్రమాలకు పాల్పడిన ఓ ఎస్సై, ఏఎస్‌ఐతో పాటు 17 మంది సిబ్బందిని వీఆర్‌కు పంపారు. ఈ క్రమంలో మన జిల్లాలోనూ ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ ప్రత్యేక నిఘాను ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఉంచారా.. అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించారా.. ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న పోలీసులను కట్టడి చేస్తారా...? అన్న విషయాలు తేలాల్సి ఉంది.


ఆదాయ వనరుగా..

జిల్లాలో జూదానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జాతీయ స్ధాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బుకీలు జిల్లాకు చెందిన వారేనన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంతో ఎక్కడ బెట్టింగ్‌లు అక్కడ ఆగి పోయాయి. జూదగాళ్లంతా  పేకాట వైపు మొగ్గు చూపుతు న్నారు. దీంతో పాత జాదగాళ్లు తెరపైకి వస్తూ బెట్టింగ్‌ స్థావరాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసి పేకాట ఆడి స్తున్నారు. ఈ స్థావరాలనే పోలీసులు ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. పేకాట స్థావరాలపై ప్రజలు వారి పరిధిలోని స్టేషన్‌లకు సమాచారం ఇస్తుండటంతో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.  నిర్వాహకులతో బేరం మాట్లాడు కొని కేసులు లేకుండా జూదగాళ్లను విడిచి పెడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే సంతపేట పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ పేకాట ముఠాను భారీగా నగదు తీసుకొని విడిచి పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ జూదగాడిని స్టేషన్‌లో కొట్టకుండా విడిచి పెట్టేందుకు లక్షలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


కేసుల పేరుతో  బెదిరింపు

కొంతమంది పోలీసులు కరోనా సమయంలో తెల్లవారు జామునుంచి తెరిచే దుకాణాల యజమానులపై పడుతు న్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల దుకాణాలు మాత్రమే తెరవాలని నిబంధనలు ఉంటే కొందరు వ్యాపారులు పొట్టకూటి కోసం మరికొన్ని దుకాణాలను తెరుస్తున్నారు. ఇదే అదునుగా తీసుకొని పోలీసులు వారిని కేసుల పేరుతో బెదిరిస్తూ  డబ్బులు దండుకుని విడిచి పెడుతున్నారని కొంతమంది వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిది గంటలపైన తెరిచి ఉన్నారని కేసులు పెడుతూ, ఫైన్‌లు వేస్తామని బెదిరిస్తూ వారివద్ద మామూళ్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వాహణాలు రోడ్లపైకి వస్తున్నాయన్న నెపంతో వాటిని సీజ్‌ చేస్తామంటూ, లేకుంటే మామూళ్లు కావాలంటూ బెదిరిస్తూ వేలకు వేలు నగదు వసూలు చేస్తున్నారని  పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై నిఘా పెట్టి గుంటూరు తరహా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Updated Date - 2020-05-18T10:06:40+05:30 IST