కనికరించని వైద్యులు

ABN , First Publish Date - 2020-03-12T09:39:07+05:30 IST

వైద్యో నారాయణో హరి అన్నారు. ప్రాణాలు కాపాడాల్సిన అలాంటి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

కనికరించని వైద్యులు

చెట్టు కింద గాయాలతో క్షతగాత్రుడు

సిబ్బందితో కలిసి ఆటల్లో మునిగిన వైనం

సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రిలో తీరిది..


సూళ్లూరుపేట, మార్చి 11 : వైద్యో నారాయణో హరి అన్నారు. ప్రాణాలు కాపాడాల్సిన అలాంటి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మానవత్వం మరిచారు. రక్తగాయాలతో చెట్టు కింద ఉన్న రోగిని పట్టించుకోలేదు. సరదాగా సిబ్బందితో కలిసి ఆటాడుకున్నారు. ఈ ఘటన సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రిలో బుధవారం జరిగింది. వెంకటాచలం మండలం సర్వేపల్లి ఇసుకపాళెంకు చెందిన నరసింహం కొంత కాలంగా మండలంలోని ఇలుపూరులో గొర్రెలకాపరిగా ఉంటున్నాడు. బుధవారం ఉదయం మోటారు సైకిల్‌పై వెళ్తూ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు.


అతనిని ఓ ఆటోలో సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో ఎవరూ లేకపోవడంతో ఆవరణలోని చెట్టుకింద పడుకోబెట్టారు. బాధితులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు.  వైద్యులు, సిబ్బంది ఆసుపత్రి వెనుక ఆవరణలో మ్యూజికల్‌ చైర్‌, క్యారంబోర్డు ఆడుకుంటున్నారు.


ఆ విషయం తెలుసుకుని బాధితులు వారి వద్దకెళ్లి ప్రమాదం గురించి చెప్పినా పట్టించుకో లేదు. దాంతో వారు మీడియాకు సమాచారం అందించారు.  మీడియా ప్రతినిధులు వెళ్లినా సిబ్బందితో ఎలాంటి చలనమూ కన్పించలేదు. మహిళా దినోత్సవం జరుపుకోలేదని, ఇప్పుడు ఆటల పోటీలు పెట్టుకున్నట్లు వారు చెప్పడం విచిత్రంగా అన్పించింది. చివరికి ఓ మేల్‌ నర్సు ఆ క్షతగాత్రుణ్ని ఆసుపత్రి బెడ్‌మీద పడుకోబెట్టి వైద్యం చేశారు.

Updated Date - 2020-03-12T09:39:07+05:30 IST