ఆ లక్ష కార్డులు తిరిగొచ్చేనా!?
ABN , First Publish Date - 2020-05-17T10:09:52+05:30 IST
సొంత ఇల్లు, నాలుగు చక్రాల వాహనం ఇలా వివిధ కారణాలతో రద్దయిన లక్ష కార్డుల మనుగడ

ఇప్పటికి 43 వేల దరఖాస్తుల పరిశీలన
నిరంతర ప్రక్రియగా వెరిఫికేషన్
ప్రస్తుతం అందరికీ రేషన్ పంపిణీ
కరోనా తర్వాత అనుమానమే!
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి), మే15 : సొంత ఇల్లు, నాలుగు చక్రాల వాహనం ఇలా వివిధ కారణాలతో రద్దయిన లక్ష కార్డుల మనుగడ ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ఇప్పటికి 43వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయినా వాటిలో ఎన్ని అర్హతగలవో పౌర సరఫరాల శాఖ ప్రకటించడం లేదు. దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన నిరంతరం కొనసాగుతుందని, అర్హమైన వాటి వివరాలను ఉన్నతాధికారులకు పంపడం వరకు తమ విధి అని జిల్లా అధికారులు అంటున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అన్ని కార్డులకు రేషన్ సరుకులు ఉచితంగా అందజేస్తున్నారు. కరోనా ఎపిసోడ్ ముగిసిన తరువాత ప్రస్తుతం చెలామణిలో ఉన్న 9.09 లక్షల కార్డులకు రేషన్ అందే అవకాశం లేదు.
జిల్లాలో 9.04 లక్షల బియ్యం కార్డులు ఉండగా, సొంత ఇల్లు, నాలుగు చక్రాల వాహనం, కరెంట్ బిల్లు తదితర నిబంధనల క్రమంలో లక్ష కార్డులను రద్దు చేశారు. మిగిలిన 8.04 లక్షల కార్డుల స్థానంలో కొత్త కార్డులను ముద్రించి పంపిణీ చేశారు. అయినా కొన్ని చోట్ల ఈ ప్రక్రియ పూర్తికాలేదు. రద్దు చేసిన లక్ష కార్డులపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వాటిని పునఃపరిశీలనకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పటికి 43వేల కార్డుల రీ వెరిఫికేషన్ పూర్తయ్యింది. మిగిలిన కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది.
కరోనా తరువాత కష్టమే:
అయితే కరోనా ఎపిసోడ్ తరువాత రద్దు చేసిన లక్ష కార్డుల మనుగడ ప్రశ్నార్థకమే. ఇప్పటివరకు 43వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యింది కాని, వాటిలో అర్హమైనవి ఎన్ని అనే విషయం సివిల్ సప్లయీస్ ప్రకటించలేదు. ‘‘జాబితా రాష్ట్ర సివిల్ సప్లయ్స్‌కు పంపాము.. అంతవరకే మా పని’’ అంటున్నారు. రద్దయిన లక్ష కార్డులు దాదాపుగా అనర్హమైనవిగానే అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 9.09 లక్షల కార్డులకు సరుకులు ఇస్తున్నా అందులో 11 శాతం మంది తీసుకోవడం లేదని, అంటే వీరంతా గ్రామాల్లో లేనట్లే కదా..! అనే వాదన అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. పరిస్థితి గమనిస్తే రద్దు చేయబడిన కార్డుల పునఃపరిశీలన ఒక కంటి తుడుపు చర్యగా కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో మరో మూడు నెలల పాటు అన్ని కార్డులకు సరుకులు అందుతాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఆ తరువాతే రద్దు కాబడిన లక్ష కార్డుల మనుగడ ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది.