మేనకూరు సేజ్ అభివృద్ధికి 6వేల కోట్లు
ABN , First Publish Date - 2020-12-17T05:33:45+05:30 IST
మేనకూరు సేజ్ అభివృద్ధికి రూ.6వేల కోట్లు కేటాయించనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ఇండస్ట్రీయల్ పార్కు
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వృత్తి నైపుణ్య కేంద్రాలు
నాయుడుపేటలో మంత్రి గౌతమ్ వెల్లడి
ఓజిలి, వెంకటాచలం మండలాల్లో డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన
నాయుడుపేట, డిసెంబరు 16 : మేనకూరు సేజ్ అభివృద్ధికి రూ.6వేల కోట్లు కేటాయించనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య బుధవారం నాయుడుపేటలో నియోజకవర్గస్థాయిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేశారన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వృత్తి నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వ హాయం ఇప్పటికి 5.20 లక్షల ఉద్యోగాలను కల్పించినట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎవరైనా ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి పనులతో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ స్వర్ణముఖినది, కాళంగి నదులపై చెక్‌డ్యామ్‌లకు 200 కోట్లు, ఇరిగేషన్ అభివృద్ధికి 45 కోట్లు, చెంబేడు తాగునీటి పథకంకు 35 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ముందస్తుగా చేపట్టిన పటిష్ఠమైన చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా కట్టడి చేయగలిగినట్లు చెప్పారు. మరోమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్ 4.45 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. ఈ సభలో తిరుపతి, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి, దువ్వూరు బాలచంద్రారెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కట్టా రమణారెడ్డి, తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి,కళత్తూరు రామమోహన్‌రెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాధాకిషోర్, పోట్లపూడి రాజేష్ తదితరులు ఉన్నారు.
ఓజిలి మండలం వాకాటివారికండ్రిగ వద్ద రూ.25.29 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసులురెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, అనిల్‌కుమార్ ప్రారంభించారు.
వెంకటాచలం మండలం వెంకటాచలం, సర్వేపల్లి, పూడిపర్తి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం, డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. అనంతరం సర్వేపల్లి, పూడిపర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో డీప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొని ప్రసంగించారు.
