డిగ్రీ, పీజీ పరీక్షలు జరుగుతాయా..లేదా?.. సందిగ్ధంలో విద్యార్థులు

ABN , First Publish Date - 2020-06-26T20:39:12+05:30 IST

కరోనా నేపథ్యంలో విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ సెమిస్టర్‌ డిగ్రీ, పీజీ పరీక్షలు జరుగుతాయోలేవోననే సందిగ్ధంలో విద్యార్థులు ఉన్నారు. వాస్తవానికి ఏప్రిల్‌, మేలో ఆ పరీక్షలు

డిగ్రీ, పీజీ పరీక్షలు జరుగుతాయా..లేదా?.. సందిగ్ధంలో విద్యార్థులు

వెంకటాచలం (నెల్లూరు) : కరోనా నేపథ్యంలో విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ సెమిస్టర్‌ డిగ్రీ, పీజీ పరీక్షలు జరుగుతాయోలేవోననే సందిగ్ధంలో విద్యార్థులు ఉన్నారు. వాస్తవానికి ఏప్రిల్‌, మేలో ఆ పరీక్షలు జరగాల్సి ఉంది. కరోనా వైరస్‌ కారణంగా వాయిదా వేశారు. వాయిదా అనంతరం షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెల్లో డిగ్రీ, పీజీ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించాలి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసి అందరూ పాస్‌ అయినట్లు ప్రకటించింది. అదే క్రమంలో డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా రద్దు చేస్తారని అందరూ భావించారు.  ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మూడు రోజుల క్రితం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్‌లు, ఉన్నతాధికారులతో  నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయా పరీక్షలు నిర్వహించాలా, వాయిదా వేయాలా, రద్దు చేయాలా అనే అంశాలపై వారి అభిప్రాయాలను  అడిగి తెలుసుకున్నారు. 


తుది నిర్ణయం వీసీలకే వదిలినట్లు సమాచారం. కొందరు వీసీలు పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని,  మరికొందరు వాయిదా వేయాలని, ఇంకొందరు రద్దు చేయాలని సూచించినట్లు తెలిసింది. చివరికి తుది నిర్ణయం ప్రభుత్వానికే విడిచిపెట్టినట్లు సమాచారం. ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వకపోవడంతో విద్యార్థులు అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. డిగ్రీ, పీజీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసినా, రద్దు చేసినా విద్యార్థులకు ఎలాంటి నష్టం ఉండదని కొందరు విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయం. మరికొందరు నష్టం ఉండవచ్చని చెబుతున్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం పరీక్షలపై ఓ స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.


ప్రభుత్వ నిర్ణయంతో మేలే జరుగుతుంది..

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా విద్యార్థులకు ఎలాంటి నష్టమూ ఉండబోదు. విద్యార్థులందరికీ మేలే జరుగుతుంది. ఇంటర్వ్యూలె ప్రతిభ కనబరిచిన వారికే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈవిషయాన్ని ప్రతి విద్యార్థీ గ్రహించాలి. 

- టీ వీరారెడ్డి, వీఎ్‌సయూ పీజీ సెట్‌ కన్వీనర్‌ 


Updated Date - 2020-06-26T20:39:12+05:30 IST