యువకుడి ప్రాణం తీసిన విద్యుత్‌ తీగ

ABN , First Publish Date - 2020-11-26T04:01:18+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో తెగిపడిన విద్యుత్‌ వైరు నెల్లూరు నగరంలో ఓ యువకుడిని బలి తీసుకుంది.

యువకుడి ప్రాణం తీసిన విద్యుత్‌ తీగ
మృతుడు రజాక్‌

భారీ చెట్టు కూలడంతో తెగిపడిన వైరు

ఆ తీగను తొక్కి అక్కడికక్కడే మృతి

నెల్లూరు(క్రైం), నవంబరు 25: నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో తెగిపడిన విద్యుత్‌ వైరు నెల్లూరు నగరంలో ఓ యువకుడిని బలి తీసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వెంకటేశ్వరపురం జనార్దనరెడ్డి కాలనీకి చెందిన అబ్దుల్‌ రజాక్‌(24) నగరంలోని వీఆర్‌సీ సెంటర్‌లోని ఎంకే స్టిక్కరింగ్‌ దుకాణంలో పని చేస్తున్నాడు. బుధవారం మాగుంట లేఅవుట్‌ యూనియన్‌ బ్యాంకు సమీపంలోని ఓ దుకాణంలో స్టిక్కరింగ్‌ చేసేందుకు తన సహచరుడు సజీర్‌బాషాతో వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని బయటకు వచ్చారు. వర్షం వస్తుండడంతో అక్కడే ఆగి సహచరుడుతో మాట్లాడుతున్న సమయంలో వర్షంతో పాటు ఈదురు గాలులు ప్రారంభమై ఆ ప్రాంతంలో ఉన్న భారీ వృక్షం కుప్ప కూలుతుండడాన్ని గమనించిన రజాక్‌ ఆక్కడి నుంచి పరుగులు తీశాడు. అయితే ఆ చెట్టుతో పాటు తెగిపడిన విద్యుత్‌ తీగను గమనించని రజాక్‌ విద్యుత్‌ తీగలను తొక్కడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటను ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురై 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది రజాక్‌ను పరిశీలించి మృతి చెందాడని నిర్ధారించారు. సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం నాగేశ్వరమ్మ, ఎస్‌ఐ విజయకుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టరం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-11-26T04:01:18+05:30 IST