-
-
Home » Andhra Pradesh » Nellore » cycolone
-
తుఫాన్ గండం గడిచింది..
ABN , First Publish Date - 2020-11-27T06:06:00+05:30 IST
ఎట్టకేలకు తుఫాన్ గండం నుంచి ప్రజలు గట్టెక్కారు. బుధవారం అర్ధరాత్రి నుంచి విపరీతమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

తడ, నవంబరు 26 : ఎట్టకేలకు తుఫాన్ గండం నుంచి ప్రజలు గట్టెక్కారు. బుధవారం అర్ధరాత్రి నుంచి విపరీతమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజాము నుంచి చలిగాలులు మాత్రమే వీచాయి. బుధవారం రాత్రి వీచిన గాలులకు 8 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. సుమారు 20 పూరిగుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇక వెండ్లూరుపాడు, కారిజాత చెరువుల్లో నీళ్లు కజులపై నుంచి పారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీడీవో శివయ్య, ఇరిగేషన్ డీఈ సతీష్‌బాబు, ప్రత్యేక అధికారి ఓంకార్‌రావులు కారిజాత చెరువుల వద్దకెళ్లి చెరువులను పరిశీలించారు. తక్షణం చర్యలు చేపట్టాలంటూ జేసీ అధికారులను ఆదేశించారు. నాయుడుపేట ఆర్డీవో సరోజిని పరిస్థితిని సమీక్షించారు. పాములకాలువ, కారిపేటి కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పొలాల్లో నీరు చేరింది.
ఇళ్లకు చేరిన మత్స్యకారులు
తెట్టుపేట దీవిలో చిక్కుకుపోయిన మత్స్యకారులు ఎట్టకేలకు ఇళ్లకు చేరుకున్నారు. ఐదు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తుఫాన్ కారణంగా తెట్టుపేటలో చిక్కుకుపోయిన విషయం విదితమే. విషయం తెలుసుకున్న అధికారులు బుధవారం రాత్రి శ్రీహరికోట నుంచి తెట్టుపేట సమీపం వరకు వెళ్లగలిగారు. ఆ తరువాత బకింగ్‌హామ్ కెనాల్‌లో నీరు ఉధృతంగా పారుతుండటంతో అక్కడే ఉన్న ముగ్గురు మత్స్యకారులను మాత్రమే వెనక్కు తీసుకురాగలిగారు. అనంతరం గురువారం మధ్యాహ్నం మరోసారి పోలీసులు, మత్స్యకార నాయకులు తెట్టుపేటకు చేరుకున్నారు. వర్షం లేకపోవడంతో అధికారులే తమ పడవల్లో వారిని ఇళ్లకు చేర్చారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.