-
-
Home » Andhra Pradesh » Nellore » cyclone
-
ని‘వర్రీ’
ABN , First Publish Date - 2020-11-27T06:18:39+05:30 IST
నివర్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరులో జనజీవనం అస్తవ్యస్థం అయింది. బుధవారం మొదలైన గాలీవాన గురువారం కూడా తన ప్రతాపాన్ని చూపించింది.

నగరంలో ఎడతెరపి లేని వర్షం
కూలిన వృక్షాలు
ముంపులోనే లోతట్టు ప్రాంతాలు
18 పునరావాస కేంద్రాలు
నెల్లూరు (సిటీ), నవంబరు 26 : నివర్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరులో జనజీవనం అస్తవ్యస్థం అయింది. బుధవారం మొదలైన గాలీవాన గురువారం కూడా తన ప్రతాపాన్ని చూపించింది. ఎడతెరపి లేని వర్షం వల్ల రోడ్లు చెరువులయ్యాయి. ట్రంకురోడ్డు, గాంధీబొమ్మ, పొగతోట, సండే మార్కెట్ ప్రాంతాలు జలశయాలను తలపించాయి. అండర్‌బ్రిడ్జీలు నీటితో నిండిపోయాయి. కాలువలు పొంగి రోడ్లపైకి మురుగు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 18 చోట్ల పునరావాసం కల్పించిన మున్సిపల్ అధికారులు 186 మందికి తక్షణ సౌకర్యాలు, ఆహారం అందిస్తున్నారు. మాగుంటలేవుట్, బీవీనగర్, వనంతోపు, ఆటోనగర్, బుజబుజనెల్లూరు, కొత్తూరు, కావేరినగర్, మన్సూర్‌నగర్, శివగిరికాలనీ, పరమేశ్వరినగర్, రంగనాయకులపేట, ఫత్తేఖాన్‌పేట, పడారుపల్లి తదితర ప్రాంతాలన్నీ బుధవారం నుంచి ముంపులోనే ఉన్నాయి.
విద్యుత్ అంతరాయం
నెల్లూరు నగరం, శివారు, విలీన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు బుధవారం నుంచి తీవ్ర విఘాతం కలిగింది. స్తంభాలు నేలకూలడం, తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గురువారం సాయంత్రానికి విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధంచడంతో నగర వాసులు ఊపిరిపీల్చుకున్నారు.
వృక్షాలు నేలమట్టం
తుఫాన్ తాకిడికి రైల్వేఫీడర్స్ రోడ్డులోని పశు సంవర్థకశాఖ కార్యాలయంలో భారీ వృక్షం కూలడంతో ప్రహారీగోడ నేలమట్టమైంది. అలాగే మాగుంట లేఅవుట్, అలంకార్‌సెంటర్, పొదలకూరురోడ్డు తదితర ప్రాంతాల్లోని భారీ వృక్షాలు కుప్పకూలాయి. అయితే, ఆస్తి ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. వృక్షాలు కూలిన ప్రాంతాల్లో కమిషనర్ ఆదేశాలతో ఎస్‌ఈ సంజయ్, ఏడీసీ ప్రసాద్, ఈఈ, డీఈఈలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పునరుద్ధరణకు కృషి చేశారు.
అధికారులు, నేతల పర్యవేక్షణ
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, రాజకీయ నాయకులు పర్యటిస్తున్నారు. మున్సిపల్ బృందాలను కమిషనర్ కే దినేష్‌కుమార్, ఆర్డీవో హుస్సేన్‌బాషా దగ్గరుండి పర్యవేక్షిస్తూ తగు ఆదేశాలిచ్చారు.
