నివర్‌ బీభత్సం

ABN , First Publish Date - 2020-11-26T04:44:39+05:30 IST

నివర్‌.. జిల్లాను వణికించేస్తోంది. బుధవారం ఉదయం నుంచే చలిగాలులకుతోడు ఈదురుగాలులు తోడవడంతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు పెలపెలమంటూ విరిగిపడ్డాయి.

నివర్‌ బీభత్సం
నెల్లూరు జిల్లా మైపాడు తీరంలో అల్లకల్లోలంగా ఉన్న కడలి

జిల్లాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు

సముద్రంలో పెరిగిన అలల ఉధృతి

నీట మునిగిన పొలాలు, దెబ్బతిన్న ఇళ్లు

50 పునరావాస కేంద్రాలు, 70 రెస్క్యూ బృందాలు

జిల్లా యంత్రాంగమంతా తీరంలోనే..

సహాయక చర్యలపై మంత్రి సమీక్ష

నెల్లూరు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : నివర్‌.. జిల్లాను వణికించేస్తోంది. బుధవారం ఉదయం నుంచే చలిగాలులకుతోడు ఈదురుగాలులు తోడవడంతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు పెలపెలమంటూ విరిగిపడ్డాయి. ఇక రోజంతా మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతం నీటమునిగాయి.  బుధవారం ఉదయం ఓ మోస్తరుగా కురిసిన వర్షం మధ్యాహ్నానికి పెరిగింది. బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు జిల్లా సరాసరి వర్షపాతం 59.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. కోటలో అత్యధికంగా 149.5 మి.మీ, వాకాడులో 135.6, కొడవలూరులో 123.8, నాయుడుపేటలో 120, చిట్టమూరులో 116.8, కోవూరులో 110.4, విడవలూరులో 114, ముత్తుకూరులో 106.6, దొరవారిసత్రంలో 102.8, సూళ్లూరుపేటలో 101.4 మి.మీ చొప్పున వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, పలు చోట్ల రోడ్లపై నీరు పారాయి. తడలో జాతీయ రహదారిపైనే వర్షపు నీరు పారింది. నెల్లూరు నగరంలో రోడ్లపైనే నీరు పారడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. ఇక జిల్లాలోని పలు మండలాల్లో నారుమళ్లు, నాట్లు నీట మునిగాయి. రబీ సీజన్‌ ప్రారంభం కావడంతో రైతులంతా ఇప్పుడిప్పుడే నార్లు పోసుకుంటూ నాట్లు వేసుకుంటున్నారు. కాగా నివర్‌ అతి తీవ్ర తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పలు చోట్ల సముద్రం ముందుకొచ్చింది. అలలు ఉధృతంగా ఎగసిపడ్డాయి. మత్స్యకారులంతా క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరుకున్నారు.  ఇక మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు వీచడంతో పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. ఈ కారణంగా విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓ వైపు వర్షం కురుస్తూనే ఉండడంతో విద్యుత్‌ను పునరుద్ధరించడం కష్టంగా మారింది. 


1946 మంది పునరావాస కేంద్రాలకు..

నివర్‌ తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ తుఫాను రక్షణ చర్యలపై నెల్లూరులో అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు కూడా ఉదయం నుంచి మండలాల ప్రత్యేకాధికారులతో టెలీకాన్పెరెన్స్‌ నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌ ప్రభాకర్‌రెడ్డి తడ మండలంలో  మకాం వేసి పర్యవేక్షించారు. ఇక జిల్లాలో 50 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 1946 మందిని తరలించారు. అలానే పలు కుటుంబాలకు ఆహార పొట్లాలు, నిత్యావసర సరుకులను అధికారులు అందజేశారు. అదేవిధంగా 70 రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేశారు. కావలి, కోట, వాకాడు, ఆత్మకూరు, సంగం, తడ, విడవలూరు, నెల్లూరు, ఇందుకూరుపేట ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు. 181 బోట్లను సిద్ధం చేశారు. కాగా బుధవారం వీచిన ఈదురుగాలుల దెబ్బకు 45 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. 


1,500 హెక్టార్లలో మునిగిన పంటలు

నెల్లూరు(వ్యవసాయం) : తుపాను ప్రభావంతో జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షానికి సుమారు 1,500 హెక్టార్లలో పంటలు నీటమునిగినట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలో ఇప్పటికే రైతులు అకాల వర్షాల కారణంగా రెండు దఫాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నారుమడులు నీటమునిగి తీవ్రంగా నష్టపోయారు.  సూళ్లూరుపేట, నాయుడుపేట సబ్‌ డివిజన్లలో సుమారు 957 హెక్టార్లలో వరినారు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా 80 హెక్టార్లలో మినుము, 15 హెక్టార్లలో పెసర, 5హెక్టార్లలో శనగ పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. అధికారుల సలహాలు తీసుకోకుండా కొంతమంది రైతులు ముందస్తుగా వరిసాగుకు సమాయత్తమవడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే నష్టపోయారు. ప్రస్తుతం సరైన సమయం కావడంతో అధికశాతం మంది రైతులు నార్లు పోసుకున్నారు. మరికొంత మంది రైతులు నాట్లు కూడా వేసుకున్నారు. తుపాను ప్రభావం కారణంగా వర్షం కురుస్తున్నప్పటికీ కావలి, బుచ్చి తదితర ప్రాంతాల్లో నాట్లు యధావిధిగా కొనసాగాయి. అయితే అనధికారికంగా సాగుచేస్తున్న పంటలతో పోలిస్తే దాదాపుగా 2వేల హెక్టార్లలో పంటలు నీట మునిగి ఉంటాయని కొందరు అధికారులు చెబుతున్నారు.

 

పలు రైళ్ల రద్దు 

నెల్లూరు(వెంకటేశ్వరపురం) : నివర్‌ తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. చెన్నై వైపు గురువారం రాకపోకలు సాగించే హైదారాబాద్‌-తాంబరం-హైదారాబాద్‌, మధురై-బైకనీర్‌-మదురై, చెన్నై సెంట్రల్‌-సంత్రాగాచీ రైలు సర్వీసులను రద్దు చేశారు. వీటితో పాటు పలు రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.  ఈ అంతరాయానికి ప్రయాణికులు సహకరించాలి కోరారు. సమాచరం కోసం విజయవాడ - 0866 - 2767239 సంప్రదించాలని తెలిపారు. 


తెట్టుపేటలో ఇరుక్కుపోయిన మత్స్యకారులు 

తడ : నివర్‌ తుఫాన్‌ కారణంగా 29 మంది మత్స్యకారులు నెల్లూరుజిల్లా శ్రీహరికోటకు సమీపంలోని తెట్టుపేట వద్ద చిక్కుకుపోయారు. తడ మండలం ఇరకందీవికి చెందిన 20 మంది, తమిళనాడులోని నోచ్చుకుప్పం, బాటకుప్పాలకు చెందిన 9 మంది మత్స్యకారులు 17 పడవల్లో  5 రోజుల క్రితం వేటకు వెళ్లారు. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో వారు ఇళ్లకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే బుధవారం ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తుండటం, గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వీరంతా శ్రీహరికోటకు సమీపంలోని తెట్టుపేట దీవి వద్ద నిలబడిపోయారు. మత్స్యకార నాయకులకు సమాచారం అందించడంతో నాయుడుపేట ఆర్డీవో సరోజిని దృష్టికి తీసుకెళ్లారు. షార్‌ అధికారులతో చర్చించిన ఆర్డీవో, పోలీసులు ప్రత్యేక వాహనంలో వారిని ఆ దీవి నుంచి బయటకు తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 


5వ తేదీ వరకు వర్షాలే!

సూళ్లూరుపేట : నివర్‌ తుఫాన్‌ ప్రభావంగా శ్రీహరికోట రీజియంలో 70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని షార్‌ వాతావరణశాఖ బుధవారం ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు చెన్నైకి 210 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో నివర్‌ కేంద్రీకృతమై ఉందని అది ఉత్తర, పడమర దిశలుగా పయనిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని హెచ్చరించారు. చెన్నై - పుదిచ్చేరి మధ్య తీరం దాటే పరిస్థితి ఉందని, దీని ప్రభావంగా బుధవారం రాత్రి నుంచి భారీ వర్షంతోపాటు 70 కి.మీ వేగంతో షార్‌ రీజియంలో గాలులు వీస్తాయని వెల్లడించారు. అలాగే డిసెంబరు 5వ తేదీ వరకు చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక 

ముత్తుకూరు : తుఫాను కారణంగా కృష్ణపట్నం పోర్టులో బుధవారం మూడో నెంబరు హెచ్చరికను ఎగరవేశారు. తీరంలో సముద్రం ముందుకు వచ్చి, అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రంలో వేటకు వెళ్లిన చెన్నైకు చెందిన 124 మరబోట్లు పోర్టులో లంగరు వేశాయి. ఈ వివరాలను పోలీసులు నమోదు చేసుకోగా, మత్స్యకారులకు అవసరమైన సదుపాయాల కల్పనకు పోర్టు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. Read more