సరిగ్గా నెల రోజుల్లో పెళ్లి.. ఇంతలో దారుణం

ABN , First Publish Date - 2020-12-08T05:17:57+05:30 IST

సరిగ్గా నెల రోజుల్లో ఆ యువకుడికి వివాహం కానుంది..

సరిగ్గా నెల రోజుల్లో పెళ్లి.. ఇంతలో దారుణం
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

నెల్లూరులో యువకుడిపై కత్తులతో దాడి

తండ్రికే స్వయంగా ఫోన్‌ చేసి చెప్పిన మృతుడు

ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి

పోలీసుల ముమ్మర దర్యాప్తు


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): సరిగ్గా నెల రోజుల్లో ఆ యువకుడికి వివాహం కానుంది. ఇంతలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. నెల్లూరు నగరంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నెల్లూరులోని విక్రమ్‌నగర్‌ చాముండేశ్వరి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మల్లిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, శంకరమ్మ దంపతులు ఉంటున్నారు. నగరపాలకసంస్థలో  శ్రీనివాసులు రెడ్డి కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తుండగా, మొదటి భార్య సీతారావమ్మ చాలా రోజుల క్రితం మృతి చెందింది. ఈమెకు ఇద్దరు సంతానం. రెండవ భార్యకు రవీంద్రనాథ్‌ రెడ్డి (25) కుమారుడు. చెన్నైలో బీటెక్‌ పూర్తి చేసిన రవీంద్రనాథ్‌ సంగంలోని ఫెడరల్‌ బ్యాంకులో రుణాలు ఇప్పించే ఏజెంటుగా రెండేళ్లుగా పని చేస్తున్నాడు. ఇటీవలే  హరనాథపురానికి చెందిన ఓ యువతితో రవీంద్రనాథ్‌కు నిశ్చితార్థం అయ్యింది. జనవరి 8వ తేదీన వివాహం జరిపేందుకు తేదీ ఖరారు కూడా చేసుకున్నారు.


కాసేపట్లో ఇంటికొస్తానని...

ఈ నెల 4వ తేదీన రవీంద్రనాథ్‌ ఆఫీస్‌ పని అంటూ విజయవాడ వెళ్లాడు. 6వ తేదీ ఆదివారం సాయంత్రం విజయవాడ నుంచి ఇంటికి వస్తున్నట్లు కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి చెప్పాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఫోన్‌ చేసి నెల్లూరుకు దగ్గరలో ఉన్నానని, కాసేపటికి ఇంటికి చేరుకుంటానని చెప్పాడు. అర్ధరాత్రి 12.15 గంటలకు మృతుడి ఫోన్‌ నుంచి తన తండ్రికి ఫోన్‌ వచ్చింది. ‘‘నాన్నా.. నేను కరెంటాఫీస్‌ సెంటర్‌ వద్ద కార్‌జోన్‌ దగ్గర ఉన్నాను. ఎవరో వచ్చి నన్ను కత్తులతో పొడిచారు. మాట్లాడలేక పోతున్నా’’ అంటూ చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన  శ్రీనివాసులురెడ్డి కుటుంబసభ్యులతో అక్కడికి చేరుకునే సరికి వేదాయపాలెం ఇన్‌స్పెక్టర్‌ టిపి సుబ్బారావు, ఎస్‌ఐ లక్ష్మణరావులు ఘటనా స్థలంలో ఉన్నారు. రక్తపుమడుగుల్లో పడిఉన్న రవీంద్రనాథ్‌రెడ్డిని జీజీహెచ్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు మృతుడు తండ్రి వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతదేహానికి వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.


కుటుంబసభ్యుల్లో తీరని శోకం

నెల రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కుమారుడు జీవశ్చవంలా పడి ఉండడాన్ని చూసి కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఈ హత్య కేసును పోలీసులు పలు కోణాల్లో ధర్యాప్తు ప్రారంభించారు. కొద్దిసేపటిలో ఇంటికి వస్తున్నాని చెప్పిన యువకుడు 45 నిమిషాల వ్యవధిలో హత్య చేయబడ్డాడు అంటే ఈ మధ్యలో ఏం జరిగి ఉంటుందో తేలాల్సి ఉంది. అసలు రవీంద్రనాద్‌రెడ్డి కరెంటాఫీస్‌ సెంటర్‌ వద్ద ఎందుకు దిగాడు, హత్య చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఫోన్‌ కాల్‌ వివరాలు, హత్య జరిగిన సమయంలో సెల్‌ఫోను టవర్‌ డంప్‌లను పరిశీలిస్తున్నారు. ఇక కరెంటాఫీస్‌ సెంటర్‌లో సీసీ కెమెరాల్లో రవీంద్రనాథ్‌రెడ్డి నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఏది ఏమైనా ఈ కేసు పోలీసులకు మిస్టరీగా మిగిలింది.

Updated Date - 2020-12-08T05:17:57+05:30 IST