రివిట్‌మెంట్‌ పేరుతో రోడ్డున పడేస్తారా?: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు

ABN , First Publish Date - 2020-12-14T04:53:38+05:30 IST

పెన్నానదికి రివిట్‌మెంట్‌ పేరుతో వందలాది పేద కుటుంబాలను రోడ్డున పడేస్తామంటే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు హెచ్చరించారు.

రివిట్‌మెంట్‌ పేరుతో రోడ్డున పడేస్తారా?: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
భగత్‌సింగ్‌కాలనీని పరిశీలిస్తున్న మధు, రాజగోపాల్‌ తదితరులు .

అవసరానికి మించి స్థలం మార్కింగ్‌

పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం

భగత్‌సింగ్‌ కాలనీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు 

 

నెల్లూరు(వెంకటేశ్వరపురం), డిసెంబరు 13 : పెన్నానదికి రివిట్‌మెంట్‌ పేరుతో వందలాది పేద కుటుంబాలను రోడ్డున పడేస్తామంటే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు హెచ్చరించారు. ఇటీవల పెన్నానదికి వచ్చిన వరదల వల్ల  వెంకటేశ్వరపురం, భగత్‌ సింగ్‌ కాలనీ, జనార్దనరెడ్డికాలనీ ప్రాంతాల్లో వేలాది నివాసాలు నీట మునిగిన విషయం తెలిసిందే. దీనికి రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ స్పందిస్తూ వెంటనే పెన్నా నదికి రెండు వైపులా రివిట్‌మెంట్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జిల్లా ఇరిగేషన్‌ అధికారులు వెంకటేశ్వరపురం, భగత్‌సింగ్‌కాలనీల్లో సర్వే చేసి రివిట్‌మెంట్‌ నిర్మించే ప్రాంతాన్ని గుర్తించి మార్కింగ్‌ చేసి వెళ్లారు. అయితే అవసరానికిమించి, పెన్నానది నుంచి చాలా దూరం లోపలికి మార్కింగ్‌ చేశారని, దీని వల్ల వందలాది నివాసాలు పడగొట్టాల్సి వస్తుందని స్థానికులు, వామపక్షాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  మధు ఆదివారం ఆ ప్రాంతంలో పర్యటించారు. అవసరానికి మించి చాలా లోపలికి మార్కింగ్‌ చేశారని, ప్రభుత్వం అనాలోచితంగా ఇలా చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని, జలవనరుల శాఖ మంత్రితోనూ మాట్లాడతానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఇళ్లు తొలగించకుండానే పొర్లుకట్ట నిర్మించే అవకాశం ఉందన్నారు. భగత్‌సింగ్‌ కాలనీ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి దీక్షలు ప్రారంభించాలని స్థానిక నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌, నగర కార్యదర్శి మూలం రమేష్‌, నాయకులు నాగేశ్వరరావు, కత్తి శ్రీనివాసులు, ప్రసాద్‌, సీపీఐ నాయకులు మునీర్‌, అన్వర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T04:53:38+05:30 IST