కు.ని ఆపరేషన్‌కు మహిళల పాట్లు!

ABN , First Publish Date - 2020-12-18T02:51:42+05:30 IST

కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకొనేందుకు దూరప్రాంతాల నుంచి ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన మహిళలకు ఇక్కట్లు తప్పడంలేదు.

కు.ని ఆపరేషన్‌కు మహిళల పాట్లు!
ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకున్న కొవిడ్‌ కిట్లను చూపుతున్న మహిళలు

కొవిడ్‌ కిట్లు, గ్లౌజ్‌లు తెచ్చుకుంటేనే శస్త్ర చికిత్స

మహిళలపై సిబ్బంది దురుసు ప్రవర్తన

ఇది ఉదయగిరి సీహెచ్‌సీలో తీరు

ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 17: కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకొనేందుకు దూరప్రాంతాల నుంచి ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన మహిళలకు ఇక్కట్లు తప్పడంలేదు. కరోనా దృష్ట్యా వారికి కొవిడ్‌ పరీక్ష నిర్వహించి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. కానీ వైద్యశాలలో కొవిడ్‌ కిట్లు లేవు. అలాగే శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యుడికి గ్లౌజ్‌లు లేవు. అవి లేకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించిన మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించి వాదనకు దిగారు. దీంతో ఏమీ చేయలేక వారే ఇతర ప్రాంతాల నుంచి కొవిడ్‌ కిట్లు తెచ్చుకుని, గ్లౌజ్‌లు కొనుగోలు చేసి శస్త్ర చికిత్స చేయించుకుంటున్న సంఘటన గురువారం ఉదయగిరి సీహెచ్‌సీలో చోటుచేసుకొంది. బాధితుల వివరాల మేరకు.. వరికుంటపాడు మండలం జీ.కొండారెడ్డిపల్లి, సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లి నుంచి ముగ్గురు మహిళలు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కోసం సీహెచ్‌సీకి వచ్చారు. వారికి వైద్యశాలలో తమ వద్ద కిట్లు, గ్లౌజ్‌లు లేవని సిబ్బంది సమాధానమిచ్చారు. దీంతో మహిళలు అవి తామెక్కడ నుంచి తీసుకురావాలని ప్రశ్నించినందుకు వారిపట్ల దురుసుగా ప్రవర్తించి వాదనకు దిగారు. అనంతరం ఆయా మండలాల వైద్యఆరోగ్య సిబ్బందితో చర్చించి కొవిడ్‌ కిట్లు తెప్పించుకున్నారు. అలాగే బయట గ్లౌజ్‌లు కొనుగోలు చేసి శస్త్ర చికిత్స చేయించుకొన్నారు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో ఉన్న సీహెచ్‌సీలో అన్ని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు చేపట్టాలని వారు కోరారు.

Updated Date - 2020-12-18T02:51:42+05:30 IST