ఫిబ్రవరి కల్లా కరోనా వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2020-12-12T03:55:20+05:30 IST

జిల్లావాసులంతా వేయి కళ్లతో ఎదురుచూసున్న కరోనా వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

ఫిబ్రవరి కల్లా కరోనా వ్యాక్సిన్‌

700 నిల్వ కేంద్రాలు.. 30 వేల మందికి...

సర్వం సిద్ధం చేసుకుంటున్న వైద్య ఆరోగ్య శాఖ

వచ్చే నెలలో ఏఎన్‌ఎంలకు శిక్షణ

ఐదు విడతలు... 90 లక్షల డోసులు

జిల్లావాసులంతా వేయి కళ్లతో ఎదురుచూసున్న కరోనా  వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. మహమ్మారి నియంత్రణకు మన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి. అన్నీ అనుకూలిస్తే కొత్త సంవత్సరం ఆరంభంలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైద్య ఆరోగ్య శాఖకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశాయి. ఐదు విడతలుగా ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు వేయనున్నారు. మొదటి విడతలోనే 30 వేల మందిని ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రతి ఒక్కరికి మూడు డోసుల చొప్పున ఈ వ్యాక్సిన్‌ వేయనున్నారు.


నెల్లూరు (వైద్యం), డిసెంబరు 11 : కరోనా మహమ్మారి కరోనా వ్యాక్సిన్‌ (టీకా) త్వరలో అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు వ్యాక్సిన్‌ నిల్వలు, మొదటి విడత ఎవరికి వేయాలి వంటి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఈ మేరకు  వైద్యాధికారులు జిల్లావ్యాప్తంగా తిరుగుతూ సమీక్ష సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. 


ఐదు విడతలలో..

ఐదు విడతలలో ఈ వ్యాక్సిన్‌ను వేయనున్నారు. మొదటి  విడతలో ఫ్రంట్‌ వారియర్స్‌గా గుర్తింపు పొందిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ఆయుష్‌ వైద్యులు, సిబ్బంది, అలాగే ప్రైవేట్‌ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బందికి వేయాలని ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వచ్చారు. మొత్తం 30వేలకు మందికిపైగా తొలివిడతలో ఉంటారు. రెండవ విడతలో పోలీసులు, మున్సిపల్‌ కార్మికులు, ఉద్యోగులు, జర్నలి్‌స్టలు, రెవెన్యూ ఉద్యోగులు ఉంటారు.  మూడవ విడతలో 50 ఏళ్లు పైబడిన వారికి, నాల్గవ విడతలో 50 ఏళ్లలోపు వయసున్న వారికి, ఐదవ విడతలో మిగిలిన వారందరికీ వ్యాక్సిన్‌ వేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ ఆఖరి ప్రయోగ దశలో ఉన్నందున వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.  


కోల్డ్‌ స్టోరేజ్‌ పాయింట్లు..

కరోనా వ్యాక్సిన్‌ను భద్రపరిచేందుకు కోల్డ్‌ స్టోరేజ్‌ పాయింట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వైద్య విభాగాలతోపాటు అంగన్‌వాడీ, సచివాలయ కేంద్రాలలో పలు ప్రాణాంతక వ్యాధులకు సంబంధించి 3500 కేంద్రాలకుపైగా వ్యాక్సిన్‌ నిల్వ కేంద్రాల ద్వారా టీకా అమలు జరుగుతున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్‌ను మాత్రం ప్రత్యేక స్టోరేజ్‌ పాయింట్లలో నిల్వ చేయాలని అధికారులు నిర్ధారించారు నెల్లూరులోని జీజీహెచ్‌, జిల్లా, ఏరియా ఆసుపత్రులతోపాటు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, కొన్ని పీహెచ్‌సీ కేంద్రాలలో ఐస్‌లైన్‌ రిఫ్రిజిలేటర్స్‌ (ఐఎల్‌ఆర్‌), డీప్‌ రిఫ్రిజియేటర్స్‌ ఇలా మొత్తం 700 వరకు అవసరమైన స్టోరేజ్‌ పాయింట్లు ఉన్నాయి. వీటిలో కరోనా వ్యాక్సిన్‌ను నిల్వ చేసేలా వైద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని భారత్‌ బయోటిక్‌, సిరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేస్తుండటంతో సదరు కంపెనీల నుంచి వ్యాక్సిన్‌ జిల్లాకు రానుంది. 


వచ్చే నెలలో ఏఎన్‌ఎంలకు శిక్షణ

ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్‌ ఎలా వేయాలి!? ఎంత మోతాదులో వేయాలి!? వంటి వాటిపై వైద్యాధికారులు ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నారు. జనవరిలో విడతల వారీగా శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి కూడా శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. శిక్షణ పూర్తి చేసుకున్న ఆరోగ్య కార్యకర్తలు గ్రామస్థాయిలలో విడతల వారీగా నిర్ణయించిన వారికి  వ్యాక్సిన్‌ వేయనున్నారు. ప్రతి ఒక్కరికి మూడు డోసులు చొప్పున వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు  సమాచారం. ఈ నేపఽథ్యంలో జిల్లాలోని 30 లక్షల మంది జనాభాకు సంబంధించి 90 లక్షల డోసుల వ్యాక్సిన్‌ అవసరమున్నట్లు వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు. 


ఓటర్ల జాబితా ప్రాతిపదికన 

కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు ఎలాంటి విధివిధానాలు అమలు చేయాలన్న కార్యాచరణపై ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. ఎన్నికలలో ఓటింగ్‌ చేపట్టే బూత్‌ల వారీగా ఓటింగ్‌ ఉన్న వారు ఆయా బూత్‌ల పరిధిలో  వ్యాక్సిన్‌ వేసుకోవాలని ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. 


13 పాజిటివ్‌ల నమోదు

జిల్లాలో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం అతి తక్కువగా 13 పాజిటివ్‌లో నమోదవగా, జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 63,302లకు చేరుకున్నాయి. ఇక కరోనా నుంచి కోలుకున్న 25 మంది బాధితులను అధికారులు డిశ్చార్జ్‌ చేశారు. 


Updated Date - 2020-12-12T03:55:20+05:30 IST