కరోనా పరీక్షలు ఇక్కడే..!

ABN , First Publish Date - 2020-04-14T11:14:50+05:30 IST

కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జిల్లాలోనే మొదలయ్యాయి. ఇప్పటి వరకు అనుమానితుల నమూనాలను పరీక్ష కోసం తిరుపతిలోని స్విమ్స్‌కు పంపేవారు.

కరోనా పరీక్షలు ఇక్కడే..!

జిల్లాకు చేరిన ఐదు ట్రూనాట్‌ యంత్రాలు

అందుబాటులోకి కిట్లు, కియోస్క్‌లు


నెల్లూరు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జిల్లాలోనే మొదలయ్యాయి. ఇప్పటి వరకు అనుమానితుల నమూనాలను పరీక్ష కోసం తిరుపతిలోని స్విమ్స్‌కు పంపేవారు. ఫలితాలకు రెండు, మూడు రోజులు పట్టేది. అయితే స్థానికంగానే అతి తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహించేందుకు ఐదు ట్రూనాట్‌ యంత్రాలు జిల్లాకు చేరాయి. నమూనాల సేకరణలో ముఖ్యమైన కియోస్క్‌లు కూడా రెండు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆదివారం నుంచి జిల్లాలోనే పరీక్షలను ప్రారంభించారు. దీని ద్వారా గంటలోపే ఫలితం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం నుంచి రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో ఈ ట్రూనాట్‌ యంత్రాల ద్వారా ఎక్కువ సంఖ్యలో శాంపిల్స్‌ను పరీక్షించనున్నట్లు పేర్కొన్నారు.


ఇప్పటి వరకు కరోనా నిర్ధారణను ఆర్టీ-పీసీఆర్‌ పద్ధతిలో పరీక్షించేవారు. తాజాగా ట్రూనాట్‌ యంత్రాల ద్వారా జిల్లాలో పరీక్షలు జరుపుతున్నారు. అనుమానితుల స్వాబ్‌, రక్తాన్ని ముందుగా కియోస్క్‌ల ద్వారా సేకరిస్తారు. ఆ రక్తాన్ని ట్రూనాట్‌ యంత్రంలో పరీక్షించి పాజిటివ్‌ వస్తే మరోసారి నిర్ధారణకు స్వాబ్‌ను స్విమ్స్‌కు పంపుతున్నారు. ట్రూనాట్‌లో పాజిటివ్‌ అని తేలితే ఆర్టీ- పీసీఆర్‌లో కూడా దాదాపుగా పాజిటివ్‌ అనే రిపోర్టు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ట్రూనాట్‌ యంత్రాల ద్వారా కరోనా పరీక్షలు జరిపేందుకు ప్రత్యేక బయోసేఫ్టీ కిట్‌ అవసరం. అది నెల్లూరులోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థ వద్ద మాత్రమే ఉంది. ప్రస్తుతం అక్కడే పరీక్షలు జరుపుతున్నారు. ఈ కిట్లు మరో రెండు యూనివర్సిటీల్లోనూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.


వాటిని అందుబాటులోకి తీసుకురా వడంతోపాటు ఇంకో రెండు కిట్ల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. మొత్తం ఐదు ట్రూనాట్‌ యంత్రాలకు ఐదు బయో సేఫ్టీ కిట్లు అందుబాటులో ఉంటే ఎక్కడికక్కడ పరీక్షలు వేగంగా జరిపేందుకు వీలుంటుంది. ఆదివారం నెల్లూరులో పరీక్షలు ప్రారంభించగా నలుగురికి  పాజిటివ్‌ అని తేలింది. ఆ నలుగురి స్వాబ్‌ను ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష కోసం స్విమ్స్‌కు పంపారు.  సోమవారం కూడా మరికొందరి శాంపిల్స్‌ను పరీక్షించారు. ఎక్కువగా నెగిటివ్‌ ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ నెగిటివ్‌ అని తేలితే ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష జరపనవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇలా ట్రూనాట్‌ యంత్రాల ద్వారా స్థానికంగానే పరీక్షలు జరపడం వల్ల ఎక్కువ మంది శాంపిల్స్‌ను పరీక్షించేందుకు అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2020-04-14T11:14:50+05:30 IST