కరోనా...కల్లోలం

ABN , First Publish Date - 2020-03-19T09:29:11+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావంతో ఎన్నో రంగాలు దెబ్బతింటున్నాయి. కొన్ని కోలుకోలేనంతగా నష్టపోతుండగా మరికొన్ని ఊగిసలాడుతున్నాయి.

కరోనా...కల్లోలం

అన్ని రంగాలు అతలాకుతలం

కోళ్ల పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ

ఆర్టీసీ, రైల్వేకు తగ్గిన ఆదాయం

హోటళ్లకు ఆర్డర్లు కరువు


నెల్లూరు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 

కరోనా వైరస్‌ ప్రభావంతో ఎన్నో రంగాలు దెబ్బతింటున్నాయి. కొన్ని కోలుకోలేనంతగా నష్టపోతుండగా మరికొన్ని ఊగిసలాడుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు కుదేలవుతుండగా ప్రైవేటు వ్యాపారాలు నిలువునా పడిపోతున్నాయి. కనిపించని ఆ వైరస్‌ విలయానికి వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారు.

 

ఆర్టీసీకి అదనపు నష్టాలు

అసలే నష్టాల ప్రయాణం సాగిస్తున్న ఆర్టీసీని కరోనా మరింత దెబ్బతీసింది. జిల్లాలో పది డిపోలుండగా దూర ప్రాంతాలకు ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. విజయవాడ, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు తదితర నగరాలకు వెళ్లే వారు కరోనా భయంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో లాంగ్‌ సర్వీసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేస్తున్నారు. ఇలా రోజుకు 20 నుంచి 30 సర్వీసులు రద్దు చేస్తున్నారు. నెల్లూరులో పాజిటివ్‌ కేసు నమోదైన రోజు నుంచి ఇదే పరిస్థితి. ఫలితంగా రోజుకు రూ.10 లక్షల చొప్పున ఇప్పటి వరకు 1.80 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. నగరంలో టౌన్‌ బస్సుల కలెక్షన్‌ కూడా తగ్గింది. రోజుకు ఆరు వేలు వసూలయ్యేది ఇప్పుడు మూడు వేలకు మించడం లేదు. సిటీ బస్సులు ఎక్కడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఆటోలదీ అదే పరిస్థితి. బస్టాండ్లు, ఆసుపత్రుల సమీపంలోని ఆటో స్టాండ్లలో గిరాకీ బాగా తగ్గింది.  


రైలు చక్రాలకు బ్రేక్‌: 

దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు, సందర్శన స్థలాల్లో యాత్రికల రాకపై నిషేధం విధించారు. దీని ప్రభావం రైల్వే మీద పడింది. 30 నుంచి 40 శాతం వరకు ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. నెల్లూరు మీదుగా నడిచే పలు స్పెషల్‌ రైళ్లను ఇప్పటికే రద్దు చేశారు. చెన్నై- సికింద్రాబాద్‌, సత్రాగచి-చెన్నై, హైదరాబాద్‌ - తిరుచురాపల్లి, ఎర్నాకుళం- హైదరాబాద్‌ తదితర రైళ్లను రద్దు చేశారు. కరోనా ఎఫెక్ట్‌తో ప్రయాణికుల వెంట రైల్వేస్టేషన్‌కు వచ్చే బంధువులు, మిత్రుల రాకను నియంత్రించడానికి ప్లాట్‌ ఫాం టికెట్‌ ధరను భారీగా పెంచారు. రూ.10 ఉన్న ఆ టికెట్‌ ధరను నెల్లూరు, గూడూరు రైల్వే స్టేషన్లలో రూ.50కి, మిగిలిన అన్ని స్టేషన్లలో రూ.20కి పెంచారు. వైరస్‌ ప్రభావంతో రైల్వే ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయింది. గతంలో నెల్లూరు స్టేషన్‌కు రోజుకు సుమారు రూ.17 నుంచి 18 లక్షలు ఆదాయం వస్తుండగా ప్రస్తుతం రూ.11 లక్షలకు తగ్గింది. అలాగే ప్రయాణికుల సంఖ్య ఇంతకుముందు 30 వేల నుంచి 35వేల వరకు ఉండగా ప్రస్తుతం 20వేలకు తగ్గింది. అత్యవసరం అయితే తప్ప ఎవరూ రైలు ఎక్కడం లేదు. ప్రధానంగా దూర ప్రాంతాలకు ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.


కళ తప్పిన థియేటర్లు

ప్రేక్షకులతో కళకళలాడే సినిమా థియేటర్లు కరోనా దెబ్బకు కళావిహీనంగా మారాయి. నెల్లూరు నగరంలో వారం రోజులుగా సినిమా హాళ్లు మూతపడ్డాయి. నెల్లూరులో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడం, ఆ వ్యాధికి గురైన వ్యక్తి మూడు రోజులపాటు ప్రజల మధ్య తిరగడంతో నగరంలో వైరస్‌ వ్యాప్తి చెంది ఉంటుందన్న అనుమానంతో జనాలు గుమికూడే ప్రదేశాలపై కలెక్టర్‌ దృష్టి సారించారు. ఈ క్రమంలో అన్ని సినిమా హాల్స్‌ను ఈనెల 13వ తేదీ నుంచి మూతవేశారు. దీంతో నగరంలోని 17 సినిమా థియేటర్లకు ఇప్పటికే సుమారు రూ.50లక్షల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం. డిస్ర్టిబ్యూటర్లు, థియేటర్‌ యజమానులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 70 థియేటర్లు ఉన్నాయి. ఇవి మూసివేయకపోయినా ప్రజలే థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. దీంతో జిల్లాలోని ఇతర థియేటర్ల కలెక్షన్‌ 70 శాతం పడిపోయింది. 


స్టార్‌ హోటళ్లు డీలా  

బస చేసే వారు లేక స్టార్‌ హోటళ్లు, లాడ్జీలు వెలవెలబోతున్నాయి. నెల్లూరులో 2స్టార్‌ హోటల్స్‌ 35 నుంచి 40 వరకు ఉన్నాయి. 3స్టార్‌, 5స్టార్‌ హోటళ్లు ఆరుకు పైగా ఉన్నాయి. వీటి ఆక్యుపెన్సీ రేటు గణనీయంగా పడిపోయింది. వంద గదులున్న లాడ్జీలో కనీసం 40 గదులైనా నిండితే ఖర్చుకు, ఆదాయానికి సరిపోతుందని నిర్వాహకులు భావిస్తుండగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొద్ది రోజులుగా కస్టమర్లు లేక స్టార్‌ హోటళ్లు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి. 


హోటళ్లు విలవిల 

కరోనా దెబ్బ హోటల్‌ పరిశ్రమ నీరసించింది. కోడి కూర తింటే కరోనా వస్తుందని జరిగిన అసత్య ప్రచారంతో హోటల్స్‌లో నాన్‌వెజ్‌ వంటల అమ్మకాలు పూర్తిగా స్తంభించిపోయాయి. నెల్లూరు నగరంలో చిన్న, పెద్ద కలిపి 170 హోటళ్లు ఉండగా జిల్లా వ్యాప్తంగా 400 వరకు ఉన్నాయి. అన్నింటి పరిస్థితి ఇంతే. వంద మందికి చేస్తే 30మంది కూడా తినడం లేదు. అసలు హోటల్‌లో తినడం ఎందుకు రిస్క్‌ అనే భావన జనాల్లో పెరిగిపోయింది. వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే ప్రజల సంఖ్య తగ్గిపోవడంతో ఆ ప్రభావం హోటళ్లలో కనిపిస్తోంది. నెల్లూరు నగరంలో హోటల్‌ పరిశ్రమ మీద సుమారు 1800 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వ్యాపారం తగ్గడంతో హోటళ్లు శ్రామికుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే 30 శాతం మంది ఉపాధి కోల్పోయారు. ఆన్‌లైన్‌ ఆర్డర్లు కూడా భారీగా తగ్గడంతో స్విగ్గీ, జమోటా వంటి యాప్‌ల ద్వారా జరిగే వ్యాపారమూ మందగించింది. గతంలో నెల్లూరు నగరంలో రోజుకు 5 వేల నుంచి 6వేల ఆర్డర్లు ఆన్‌లైన్‌ ద్వారా హోటళ్లకు వచ్చేవి. వీటిని డోర్‌ డెలివరీ చేయడానికి సుమారు 500 మంది యువకులు రన్నర్స్‌గా పనిచేస్తున్నారు. 15 రోజుల క్రితం వరకు వీరు కమీషన్‌ రూపంలో రోజుకు రూ.800 నుంచి 1000 వరకు సంపాదిస్తుండగా ప్రస్తుతం 300కు మించడం లేదు. నాన్‌ వెజ్‌ వంటకాల బుకింగ్‌ పూర్తిగా ఆగిపోయింది. పిజ్జా, బర్గర్ల వంటి బేకరీ ఐటెమ్స్‌ మాత్రమే అమ్ముడుపోతున్నాయి. 


కోళ్ల పరిశ్రమ కుదేల్‌..

సరిగ్గా నెల రోజుల క్రితం బ్రాయిలర్‌ చికెన్‌ ధర కిలో రూ.180. ప్రస్తుతం కిలో రూ.60. లైవ్‌ బర్డ్‌ అయితే కిలో 40 రూపాయలే. కొన్ని చోట్ల వందకు నాలుగు కిలోలు కూడా ఇస్తున్నారు. కోడికూర తింటే కరోనా వస్తుందనే ప్రచారం కోళ్ల పరిశ్రమను నిలువునా ముంచేసింది. జనం చికెన్‌ తినడం దాదాపుగా మానేశారు. గతంలో నెల్లూరు నగరంలో ఆదివారం 80వేల కిలోలు, ఇతర రోజుల్లో 500 కిలోల చికెన్‌ అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం ఈ అమ్మకాలు 90 శాతం తగ్గిపోయాయి. గుడ్డు ధర రూ.5.50 నుంచి 3 రూపాయలకు పడిపోయింది. ఇప్పటికే చాలా చికెన్‌ సెంటర్లు మూతపడ్డాయి. మిగిలిన వాటి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. 


తగ్గిన రొయ్యల ఎగుమతి 

రొయ్యల సాగులో జిల్లాది ప్రత్యేక స్థానం. ఇక్కడి నుంచి చైనా, అమెరికా, సౌదీ, యూరప్‌ దేశాలకు రొయ్యలు ఎగుమతి చేస్తున్నారు. కరోనా దృష్ట్యా దిగుమతులను ఆ దేశాలు అనుమతించకపోవడంతో రొయ్యల ధరలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. 30 కౌంట్‌ రొయ్యల ధర రూ.490 నుంచి 410కి పడిపోయింది. జిల్లా పరిధిలో లక్ష ఎకరాల్లో రొయ్యలు సాగవుతున్నాయి. అయితే వీటిలో 90 శాతం గుంటల్లో పంట చేతికి రావడానికి ఇంకా రెండు నెలల కాలం పడుతుంది. అప్పటికి మార్కెట్‌ కుదుట పడితే సరి. లేకుంటే జిల్లా పరిధిలోని రొయ్యల రైతులు భారీగా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. 


చిక్కిపోతున్న చేనేత

కరోనా ప్రభావం చేనేత రంగంపై కూడా పడింది. నూలు, పట్టు, జరీ చీరల ఎగుమతులు, దిగుమతులు స్తంభించిపోయాయి. జిల్లాకు సూరత్‌ నుంచి జరీ, చైనా నుంచి పట్టు దిగుమతి అవుతాయి. ఇక్కడ నేసిన చీరలు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలకు, దేశీయంగా తెలంగాణ, మహారాష్ట్ర, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. చైనా, సూరత్‌ నుంచి వచ్చే పట్టు, జరి దిగుమతులు ఆగిపోయాయి. ప్రతి నెల 50లక్షల ముడిసరుకు దిగుమతి అవుతుండగా, 70 లక్షల నేత చీరలు ఎగుమతి అయ్యేవి. ఇవన్నీ స్తంభించిపోయాయి. దీనివల్ల సుమారు 4వేల చేనేత కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. 


ధాన్యం దిగాలు...

కరోనా ప్రభావం వరి ధాన్యాన్నీ వదలిపెట్టలేదు. జిల్లా నుంచి ప్రతి రోజు 1750 టన్నుల ధాన్యం కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ధాన్యానికి సంబంధించి చెన్నై లోని రెడ్‌హిల్స్‌ ప్రాంతం దేశంలోనే అతి పెద్ద అంతర్జాతీయ మార్కెట్‌. కరోనా దెబ్బతో ఆ మార్కెట్‌కు బయ్యర్స్‌(కొనుగోలు దారులు) రావడం మానేశారు. కేరళలో ఇతర ప్రాంతాల నుంచి కొనుగోళ్లను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి ప్రస్తుతం రోజుకు 750 టన్నుల ధాన్యం మాత్రమే ఎగుమతి అవుతోంది. భవిష్యత్తులో ఇది మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం ధరల మీద పడుతోంది. ఇప్పటికే మద్దతు ధర లభించక అన్నదాతలు అల్లాడుతున్నారు. ఏ గ్రేడ్‌ రకాలకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పుట్టి 15,595 రూపాయలు కాగా, బహిరంగ మార్కెట్‌లో నెల్లూరు జిలకర 12,800, డిపీటీ 14,000, ఎంటీయూ 1010 రకం 12,700లకు మించి పలకడం లేదు. ఈ ధర మరింత తగ్గే ప్రమాదం లేకపోలేదు. 


వాణిజ్య సముదాయాలు వెలవెల 

ఎప్పుడూ జనరద్దీతో కిటకిటలాడే మాల్స్‌ ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే నెల్లూరులోని ఎంజీబీ మాల్‌ మూతపడింది. మిగిలిన పెద్ద మాల్స్‌లోనూ వ్యాపారం గణనీయంగా తగ్గిపోయింది. మొన్నటి వరకు మాల్స్‌లో షాపింగ్‌ చేయడం ఒక హాబీగా పెట్టుకున్న వినియోగదారులు ఇప్పుడు ఎక్కువ జనం ఉంటారనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లడం మానేశారు. అవసరమైన సరుకులను చిన్న దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో షాపింగ్‌ మాల్స్‌కు పెద్ద దెబ్బ తగిలింది.


దయచేసి పెళ్లికి రావొద్దు..!

ఇది పెళ్లిళ్ల సీజన్‌ కాదు. అయినా ఒకటి అరా కల్యాణాలు జరుగుతున్నాయి. కానీ వాటిలో సందడి కనిపించడం లేదు. వివాహ వైభవాలు కేవలం రక్తసంబంధీకులకే పరిమితం అవుతున్నాయి. పెళ్లిళ్లకు రారండి.. అంటూ ఆహ్వాన పత్రికలు పంచిన వారే తిరిగి తమ పెళ్లిళ్లకు రావద్దని బంధువులకు, స్నేహితులకు సెల్‌ ఫోన్‌ మెసేజ్‌లు పెడుతున్నారు. ‘క్షమించగలరు, కరోనా కారణంగా ఎక్కువ మంది గుమికూడే కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేసిన క్రమంలో మీ, మా ఆరోగ్యం దృష్ట్యా మా వివాహానికి హాజరు కావద్దని ప్రార్థిస్తున్నాము. ఇది అందరి ఆరోగ్యం కోసం చేస్తున్న అభ్యర్థనే తప్ప వేరు కాదు. అన్యధాభావించవద్దు!’. అని సందేశాలు పంపుతున్నారు. ఇతర శుభకార్యాలను కూడా ఇంటి మటుకే జరుపుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.


ఆలయాలకు తగ్గిన భక్తులు..

ఆలయాలకు భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. రంగనాఽథస్వామి, జొన్నవాడ కామాక్షితాయి, పెంచలకోన వంటి పెద్ద ఆలయాలు సైతం భక్తులు లేక బోసిపోతున్నాయి. కనుపూరు ముత్యాలమ్మ జాతరను ఆ ప్రాంతానికే పరిమితం చేయడంతో యాత్రికులు కరువయ్యారు. మరోవైపు కరోనా వైరస్‌ నిర్మూలనకు ఆలయాల్లో ప్రత్యేక హోమాలు, పూజలు మొదలయ్యాయి. ఉత్సవాలను ఆలయాలకే పరిమితం చేశారు.


ఆఫీసులు, ఆలయాలకు సూచనలు

ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఉద్యోగులు, విజిటర్స్‌, ఆలయాల్లోకి భక్తులు ప్రవేశించే ముందు ఏలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం ఆఫీసులు, ఆలయాల్లోకి వెళ్లేముందు కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇందుకు అవసరమైన శానిటైజర్లు, మాస్క్‌లు, థర్మల్‌ గన్‌లు సిద్ధంగా ఉంచాలి. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారిని  లోనికి అనుమతించకుండా పక్కన కూర్చోబెట్టాలి. ఆ విషయాన్ని 108 నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలి. విదేశీ వ్యక్తులు, భక్తులు 14 రోజులపాటు ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి రావద్దని మర్యాదపూర్వకంగా మైక్‌ అనౌన్స్‌మెంట్లు చేస్తుండాలి. దేవాలయాల్లోని పుష్కరాలు, నదులు, సెలయేళ్ల వద్ద సామూహిక పుణ్య స్నానాలకు అనుమతించరాదు. ఎక్కువ సంఖ్యలో గుమికూడే కార్యక్రమాలు, ఉత్సవాలు, క్రతువులు చేయకూడదు. ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను ఆలయ ప్రాంగణాల్లోనే చేయాలి. భక్తులకు లైవ్‌ టెలికాస్ట్‌ ద్వారా చూపాలిగానీ, ఆలయంలోనికి అనుమతించకూడదు. ఆర్జిత సేవలు అన్నీ రద్దు చేయాలి. సర్కారీ పూజలు, నివేదనలు, సేవలు దేవస్థానం అర్చకులు, వైదిక సిబ్బంది మాత్రమే నిర్వహించాలి. భక్తులందరికి లఘు దర్శనం మాత్రమే కల్పించాలి. 

Updated Date - 2020-03-19T09:29:11+05:30 IST