విమానాశ్రయం ‘సొంతంగానే’..!

ABN , First Publish Date - 2020-10-14T18:23:08+05:30 IST

దగదర్తి మండలం దామవరంలో విమానాశ్రయ నిర్మాణం దశాబ్దాలుగా ఊగిసలాటలోనే..

విమానాశ్రయం ‘సొంతంగానే’..!

రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం?

రాష్ట్ర కేబినెట్‌లో స్పష్టత

కొలిక్కిరాని భూసేకరణ

ఇంకా రూ.94 కోట్లు అవసరం


కావలి(నెల్లూరు): దగదర్తి మండలం దామవరంలో విమానాశ్రయ నిర్మాణం దశాబ్దాలుగా ఊగిసలాటలోనే ఉంటోంది. ఇదిగో.. అది గో విమానాశ్రయం అంటూ పాలకులు చెబుతున్న మాటలు ఆచరణలో సాధ్యం కావడం లేదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  విమానాశ్రయ ఏర్పాటుకు కదలికలు వచ్చినా నేటికి ఓ కొలిక్కి రాలేదు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా మన రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీ అశోక్‌గజపతి రాజు ఉండటంతో విమానశ్రయ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి.  విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 1350 ఎకరాలలో వెయ్యి ఎకరాలకుపైగా భూసేకరణ పూర్తయ్యింది. మరో 300 ఎకరాలు కోర్టు వివాదాల కారణంగా పెండింగ్‌లో ఉంది. 2019, జనవరిలో విమానాశ్రయ నిర్మాణానికి అప్పటి సీఎం చంద్రబాబునాయుడు విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.


కర్నూలు తరహాలో..

విమానాశ్రయ నిర్మాణ టెండర్లను గతంలో టర్బో ఏవియేషన్‌ సంస్థ దక్కించుకుంది. రాష్ట్ర విమానాశ్రయాల సంస్థ (ఏపీ ఏడీసీఎల్‌), టర్బో ఏవియేషన్‌ మధ్య ఒప్పందం కూడా గతం లో చేసుకుంది. అయితే అప్పట్లో పూర్తిస్థాయిలో భూమిని అప్పగించకపోవడం, టెండర్ల గడువు పొడిగించినా పనులు ప్రారంభానికి నోచుకోకపోవడంతో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆ టెం డర్లను రద్దు చేసింది. దీంతో ఇక దగదర్తిలో విమానశ్రయం నిర్మాణం కలగానే మిగులుతుందనే భావన జిల్లావాసులలో కలిగింది. అయితే ప్రభుత్వంపై నేతలు ఒత్తిడి తీసుకురావడంతో ముఖ్యమంత్రి జగన్‌ స్పందించారు. విమానశ్రయ నిర్మాణానికి తిరిగి టెండర్లు పిలిస్తే ఆలస్యమవుతుందని కర్నూలు తరహాలోనే దగదర్తిలో కూడా రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో  స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలాఉంటే ఇప్పటికే భూసేకరణ చేసి రైతులకు పరిహారం కొంత చెల్లించగా ఇంకా  పెండింగ్‌లో ఉంది. కోర్టు వివాదంలో ఉన్న భూముల భూసేకరణకు రూ.94 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 


బడ్జెట్‌ వస్తేనే భూసేకరణ

దగదర్తి విమానాశ్రయ నిర్మాణానికి పూర్తిస్థాయిలో భూసేకరణ చేపట్టేందుకు బడ్జెట్‌ రాలేదు. ఇంకా రూ.94 కోట్లు అవ             సరమని ప్రతిపాదనలు పంపాం. బడ్జెట్‌ రిలీజ్‌కాగానే భూసేకరణ చేపడతాం. నిర్మాణ పనులు విషయం మాకు సంబంధం లేదు.

- ఎం.దాసు,  ఆర్డీవో 

Updated Date - 2020-10-14T18:23:08+05:30 IST